Telangana Cabinet on Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ సాగింది. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించింది. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు 3 డ్యాంలపై పరీక్షలు పూర్తయ్యాక ఆ నివేదిక మేరకు పనులు చేయాలని నిర్ణయించింది. అప్పటివరకు రైతులకు ఇబ్బంది కలగకుండా తక్కువ ఖర్చుతో తాత్కాలికంగా నీరు లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు, పునరుద్దరణపై ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే తదుపరి కార్యాచరణ పాటించాలని నిర్ణయించారు. మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని, గేట్లు ఎత్తివేయాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరమ్మతులు చేసినా డ్యాం భద్రతపై గ్యారంటీ లేదని తెలిపిందన్నారు. తాత్కాలికంగా రాక్ ఫిల్డ్ డ్యామ్ నిర్మించి నీటిని ఎత్తిపోసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిపుణులు, అధికారులను కేబినెట్ కోరింది.
'మూడు బ్యారేజీలలో గేట్లు ఫ్రీఫోల్డ్లో ఉంచాలని, ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏమైనా రిపేర్లు చేసినా ఆ డ్యాం ఉంటుందో ఉండదో మేం చెప్పలేమని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక సూచనల మేరకే పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది' - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి
బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం : కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం చేసిన ఖర్చు వృథా కాకుండా నిపుణులతో సూచనల మేరకు రైతుల ప్రయోజనాలను కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థ, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది.
ఎన్‌డీఎస్‌ఏ సూచన మేరకు జియోటెక్నికల్, జియో ఫిజికల్, కాంక్రీటు ఇన్వెస్టిగేషన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్‌కు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లేఖ రాశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతులు, ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సుల మేరకు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ల రోజువారీ పర్యవేక్షణ బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
'మూడు బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు సూచనల మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించాం. ఇంతకముందు సాంకేతిక నిపుణులు చెప్పింది వినకపోతే ఏమైదో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ప్రజా ధనం వృథా కాకుండా నిపుణుల సూచనల మేరకు రైతుల ప్రయోజనాలను కాపాడుతాం' - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions