Telangana Cabinet Meeting Postpone : ఎన్నికల కమిషన్ అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఇవాళ కేబినెట్ సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకు సంబంధించిన అజెండాను కూడా సీఎస్ శాంతికుమారి సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర లోక్ సభ ఎన్నికలు ముగిసినప్పటికీ, కోడ్ అమల్లోనే ఉన్నందున కేబినెట్ సమావేశం నిర్వహణ కోసం ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది.
EC Gives No Clarity on Telangana Cabinet Meeting : ఈసీ అనుమతి వస్తుందని భావించి సీఎం, మంత్రులు, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు సాయంత్రం సచివాలయానికి వచ్చారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, రాత్రి 7 గంటల వరకు వేచి చూసి సీఎం రేవంత్ సహా మంత్రుల బృందం వెనుదిరిగారు. ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాతే కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం వరకు ఈసీ స్పందించక పోతే, మంత్రులతో కలిసి దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం నిర్ణయించారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, పెండింగులో ఉన్న పునర్విభజన వివాదాలు, విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ఏర్పాట్లు తదితర అంశాలు కేబినెట్లో చర్చించాలని భావించారు. ఈసీ అనుమతి రాకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన పలు అంశాలు చర్చించలేక పోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth on NDA Recommendations : మరోవైపు ఈసీ అనుమతి కోసం వేచి చూస్తూనే ముఖ్యమంత్రి రేవంత్, సహచర మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక, తదుపరి చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సీఎం చర్చించారు.
మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీకి తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. బ్యారేజీలకు ప్రమాదం ఉందని 2019లోనే తేలిందని మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, ప్రాజెక్టుకు ముప్పు తప్పదని ఎన్డీఎస్ఏ నివేదించిందని సీఎం, మంత్రులకు ఉత్తమ్ వివరించారు. కేబినెట్లో చర్చించి వర్షాకాలం రాకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కేబినేట్ భేటీ జరగక పోవడంతో కీలక అంశాలపై చర్చించలేక పోయాం : మరమ్మతులు చేయాలా, ప్రత్యామ్నాయాలు పరిశీలించాలా, మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలనే అంశాలపై ఇరిగేషన్ అధికారుల చర్చించాల్సి ఉందన్నారు. ఈసీ అనుమతి రానందున కేబినేట్ భేటీ జరగక పోవడంతో కీలక అంశాలపై చర్చించలేక పోయామని సీఎం అన్నారు. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల, పంప్ హౌజ్‌లను పరిశీలించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.