TDP Worker Murder Case: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లమడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తను గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. పొలంలో నిద్రిస్తున్న ఆయనను అర్ధరాత్రి సమయంలో వేట కొడవళ్లతో దారుణంగా నరికి హతమార్చారు. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఈ హత్య పుట్టపర్తి నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతోంది.
నలుగురు వ్యక్తుల మధ్య ఘర్షణ - పరస్పరం కత్తులతో దాడి - Fight Between Four People stabbing
వివరాల్లోకి వెళ్తే: దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దాయదులైన దుద్దుకుంట అమర్నాథ్ రెడ్డి ఇటీవల పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి అమర్నాథ్ రెడ్డి పొలంలోకి వెళ్లిన సమయంలో కాపు కాసి వేట కొడవళ్లతో గుర్తు తెలియని దుండగులు నరికి చంపినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
అమర్నాథ్ రెడ్డి హత్యపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది నిజంగా రాజకీయ హత్యా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.