TDP Varla Ramaiah Complaint to CEO: ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై తెలుగుదేశం పార్టీ మరోమారు ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేసింది. ఒంగోలులో పనిచేస్తున్న సీఐలు ఎం.లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిలపై ఫిర్యాదు చేసింది. మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగిన వ్యవహారంలో భక్తవత్సల రెడ్డి అక్కడే ఉన్నారని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. భక్తవత్సలరెడ్డిని, లక్షణ్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని కోరుతూ సీఈఓకి టీడీపీ నేతలు విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
ఇలాంటి వ్యక్తులు విధుల్లో ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరులో గంగిరెడ్డి అనే సీఐ పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తారని, కాబట్టి ఆయనను సైతం తప్పించాలని టీడీపీ కోరింది. అదే విధంగా సాక్షి పత్రికలో అభ్యర్ధులపై వస్తున్న ఆర్టికల్స్‌ను పెయిడ్‌గా పరిగణించాలని కోరారు. ముఖ్యమంత్రిపై దాడి చేశారనే అభియోగంపై సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని, ఈ ఘటనపై 307 సెక్షన్‌తో కేసు ఎలా పెడతారని టీడీపీ ప్రశ్నించింది. సతీష్‌ను మరో కోడికత్తి శీనుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు - రాళ్ల దాడి ఘటనలపై ఫిర్యాదు - NDA Leaders Complaint to Governor
TDP Leader Varla Ramaiah Letter to SEC: పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై నేటికీ ఎటువంటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేదని అన్నారు. పోలీసులు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లను సంబంధిత ఆర్ఓలకు పంపేందుకు కూడా నోడల్ అధికారులు సహకరించాలన్నారు.
ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ ఫామ్‌లు అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల్లో సంచలనాత్మక వార్తలు వింటారని, ఎన్నికల ప్రక్రియలో పెను మార్పులు ఉంటాయని చెప్పిన పాత నేరస్థుడు అవుతు శ్రీధర్ రెడ్డిని పోలీసులు ఎందుకని కస్టడిలోకి తీసుకోలేదని, విచారించలేదని ప్రశ్నించారు. అవుతు శ్రీధర్ రెడ్డి చెప్పినట్లే నాల్గవ రోజు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులు ఈ కోణంలో ఎందుకు విచారించలేదని నిలదీశారు.
Bopparaju Venkateswarlu Request to EC: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులపై వస్తున్న నిరాధారమైన ఆరోపణల కారణంగా ఒత్తిడి ఉందని, దాన్ని నివారించేలా ఆత్మస్థైర్యం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఉద్యోగ సంఘాల నేతలు సీఈఓకు వినతిపత్రం ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ అసోసియేషన్ తరఫున ఆ సంఘం నేత బొప్పరాజు, పలిశెట్టి దామోదర్‌లు విజ్ఞాపన పత్రాన్ని సీఈఓకి అందజేశారు.
నిరాధారమైన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ తర్వాతే చర్యలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి కోరింది. పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య సందిగ్ధ పరిస్థితి లేకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల సిబ్బందికి స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా ఒకరోజు ప్రకటించి, ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరింది. దీంతో పాటు ఎన్నికల నిర్వహణకు సరిపడా నిధులు విడుదల చేసి సిబ్బందిపై ఆర్థిక భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన బీఎల్వోలకు, సూపర్వైజర్లకు రెండేళ్లుగా గౌరవవేతనం చెల్లించలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు బొప్పరాజు ఫిర్యాదు చేశారు.