Chandrababu Tribute to Ramoji Rao : టీడీపీ అధినేత చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు రామోజీ ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఫిలింసిటీకి చేరుకున్నారు. రామోజీరావు పార్థివదేహానికి భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నివాళులు అర్పించారు. భౌతికకాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబసభ్యులను పేరుపేరునా పలకరించారు. అందరినీ పరామర్శించారు. అంతులేని ఆవేదనలో ఉన్నవారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా రామోజీకి నివాళులు అర్పించారు.
తెలుగు ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా ఉంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిలింసిటీ సహా అనే వ్యవస్థల నిర్మాణంతో తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్న చంద్రబాబు రామోజీరావు మరణం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.
"సమాజహితం కోసమే అనునిత్యం కష్టపడ్డారు. తెలుగుజాతి కోసం అహర్నిశలు పనిచేశారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ అని. చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ధర్మం ప్రకారం పనిచేస్తానని రామోజీరావు స్పష్టంగా చెప్పేవారు. రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిలింసిటీ స్థాపించారు. రామోజీరావు తన జీవిత కాలంలో విశ్వసనీయత సంపాదించారు. తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేశారు. ఏపీ భివృద్ధికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తాం. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను." - చంద్రబాబు, టీడీపీ అధినేత
రామోజీరావు తెలుగు వెలుగు అని చంద్రబాబు కీర్తించారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని, ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.