TDP Leaders on Searches at EX Minister House: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పొంగూరు నారాయణ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన నారాయణ ఆసుపత్రిలో సోదాలు నిర్వహించడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను భయాందోళనకు గురి చేసేందుకు వ్యవస్థల్ని వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. అసలు నారాయణ ఆసుపత్రిలో తనిఖీలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.
నారాయణ ఇంట్లో సోదాలు చేయడం అన్యాయమని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఇది వ్యక్తిగత కక్షకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. మాజీమంత్రిపై జగన్ రెడ్డికి ఇంకా పగ తీరినట్టు లేదని ఆయన విమర్శించారు. ఎటువంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఐదుగురు డీఎస్పీలు, 8మంది సీఐలతో నారాయణ ఇంటిని సోదా చేయడం అక్రమమన్నారు.
టీడీపీ సానుభూతిపరుల పరిశ్రమ్లలోనే సోదాలు ఎందుకు : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోందని షరీఫ్ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి వ్యవస్థల్ని ఒక అస్త్రంగా వాడుకుంటోందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనడానికి నారాయణ ఇంట్లో, ఆసుపత్రిలోని సోదాలే నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకులను భయాందోళనలకు గురిచేసేందుకు వ్యవస్థల్ని ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఎల్లప్పుడూ అధికారంలో ఉంటుందనుకోవడం భ్రమేనన్న షరీఫ్, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు వైఎస్సార్సీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
'కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ.351 కోట్లు సీజ్- భారీగా ఆభరణాలు సైతం'- సీబీడీటీ అధికారిక ప్రకటన
సోదాలను ఖండించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి: సర్వేలన్నీ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడంతో, ఓటమి తప్పదని భావించిన ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ ఇంట్లో, ఆసుపత్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తే భయపడే వారెవరూ లేరని కోటంరెడ్డి అన్నారు.
వివాదరహితుడైన నారాయణపై ఇలాంటి దాడులు చేయించడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటంతో, భయపెట్టైన ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని కోటంరెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మాని, ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
జగన్ను గద్దె దింపుతాం - వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే : బండారు శ్రావణి
తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది: రాజకీయ కక్షలో భాగంగానే నారాయణ సంస్థలపై దాడులు జరిగాయని తెలుగుదేశం నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విమర్శించారు. ఆసుపత్రిని పరిశీలించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, నారాయణ నివాసంలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని గిరిధర్ రెడ్డి ప్రశ్నించారు.
అధికార పార్టీ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం యువ నేత లోకేశ్ శంఖారావం కార్యక్రమం చేపట్టారని గిరిధర్ రెడ్డి ప్రకటించారు. రానున్న 40 నుంచి 50 రోజుల్లో 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సందర్భంగా లోకేశ్ పర్యటిస్తారని తెలిపారు. శంఖారావం కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని, తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
టీడీపీ ప్రభుత్వంలో కడప స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటాం : భూపేశ్ రెడ్డి