Chandrababu Naidu : విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు నాయుడిని, ఆ పార్టీ సీనియర్ నేతలు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల తదనంతర పరిణామాలపై చంద్రబాబుతో టీడీపీ నేతలు గంటన్నరపాటు చర్చించారు. రాష్ట్రంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని, ఎలక్షనీరింగ్ బాగా చేశాం, నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ఈ సందర్భంగా నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తి ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. పవన్ ఒకే మాటకు కట్టుబడి ఉండి సహకారం అందించారని వెల్లడించారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడిందని నేతలతో చంద్రబాబు అన్నారు.
ఓటమి భయంతో వైఎస్సార్సీపీ దాడులకు పాల్పడిందని తెలిపారు. దాడులకు ప్రణాళికలు రచించి తెలుగుదేశంపై విష ప్రచారం చేశారని పేర్కొన్నారు. మాచర్ల, తాడిపత్రిలో చేసిన హింస రాష్ట్రమంతా చేయాలని చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొన్నామని వెల్లడించారు. కౌంటింగ్ రోజూ అల్లర్లు సృష్టించేందుకు వైస్సార్సీపీ యత్నిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. వైఎస్సార్సీపీ ఓటమిని అంగీకరించిందనేందుకు ఇదే ఉదాహరణ అని బాబు తెలిపారు. వైఎస్సార్సీపీ కేవలం 35 సీట్లకే పరిమితమవుతుందనే ప్రచారం ఉందని నేతలు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. పోలింగ్ తీరు చూస్తే వైఎస్సార్సీపీకి 35 సీట్లు కూడా వచ్చేట్లు లేవని నేతలతో చంద్రబాబు పేర్కొన్నారు. ఇక చంద్రబాబు గురువారం సాయంత్రం అమరావతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి చంద్రబాబు - పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబుకు ఘన స్వాగతం- శంషాబాద్ ఎయిర్పోర్టులో తమ్ముళ్ల సందడి - Chandrababu Return From Foreign
టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్: విదేశీ పర్యటన ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాక పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటమికి కారణాలు వెతుకుతున్న వైఎస్సార్సీపీ నేతలు, ఆ క్రమంలో ఈసీ, పోలీసులు తీరుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. 2 కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్లపై వైఎస్సార్సీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు - Chandrababu Teleconference