TDP Leader Atchannaidu Letters to Chief Electoral Officer : రాష్ట్రంలోని పోలింగ్ బూత్‌లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రెండు లేఖలు రాశారు. రాష్ట్రంలో 3,005 సున్నితమైన పోలింగ్ బూత్‌లు ఉన్నాయని వాటికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్ బూత్ బయట, లోపల వీడియోగ్రఫీని ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్జర్వర్‌లను నియమించాలని లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతలకు బాధ్యత వహించే పోలీసు అధికారుల ఫోన్ నంబర్‌లను తెలియజేయాలని కోరారు.
వైఎస్సార్సీపీ అరాచకాలపై ఈసీకి అచ్చెన్న లేఖ- ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి
అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వెంకట రమణా రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తూ ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు మరో లేఖ రాశారు. సచివాలయం ఉద్యోగులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి సీసీఏ నిబంధనలు అధిగమించారని ఆయన ఆరోపించారు. వైసీపీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న మీడియాపై దుర్భాషలాడి, వైసీపీకి అనుకూలంగా అతను చేసిన వీడియో క్లిప్పింగ్‌లను అచ్చెన్నాయుడు లేఖకు జత చేసి ఎన్నికల అధికారికి పంపించారు.
Atchannaidu Complaint on Volunteers : అలాగే ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రెండు లేఖలు రాశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సీఈసీకి ఫిర్యాదు చేశారు. 2021-22 స్థానిక సంస్థల ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ అభ్యర్ధులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, అక్రమ కేసుల పెట్టారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం అదే ధోరణి పునరావృతం చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నాడని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
అదేవిధంగా రాజకీయ ప్రచారంలో సచివాలయ వాలంటీర్ల ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీకి అచ్చెన్నాయుడు మరో లేఖ రాశారు. ఎన్నికల కార్యకలాపాల్లో వాలంటీర్లు పాల్గోనకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ, ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరుపున వాలంటీర్లు డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించారని ఆరోపించారు.
Atchannaidu Letter To CS : వాలంటీర్లు తన సైన్యం అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారని లేఖలో వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్లను ఎంచుకునే సీనియర్ సిటిజన్లకు దరఖాస్తులను సులభతరం చేయాలని వాలంటీర్లకు చెప్పిన మంత్రి ధర్మానపై కూడా అచ్చెన్న ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారాలకు సహకరించాలని వాలంటీర్లకు 15 రోజులుగా వైసీపీ నాయకులు డబ్బు, బహుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తున్నందున రాజకీయ ప్రచారం చేయడం అనైతికమని తెలిపారు. ఈ విషయాన్ని అత్యవసర అంశంగా పరిగణలోనికి తీసుకొని రాజకీయ ప్రచారంలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధించాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.
"నాకు ప్రాణాపాయం ఉంది.. భద్రత పెంచండి" డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ