Survey Of India To Work With Hydra In Hyderabad : హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్దరణ కోసం హైడ్రాతో కలిసి పనిచేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్దారించడంలో ఇకపై సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యం కానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తన బృందంతో కలిసి హబ్సిగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
హైడ్రాతో సర్వే ఆఫ్ ఇండియా : సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌లను పరిశీలించిన రంగనాథ్ 1971 - 72 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులున్నాయి? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ప్రస్తుతం వాటి పరిస్థతి ఏంటి? నాలాలు ఎంత విస్తీర్ణంలో ఉండేవి, ఇప్పుడు ఎంత మేర కబ్జా అయ్యాయనే తదితర వివరాలను మ్యాప్‌లతో సహా పరిశీలించారు.
దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లతో పాటు నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు రంగనాథ్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై డాటాను పరిశీలించారు.
హైడ్రా చర్యలు : సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదిక తయారు చేస్తామని, ఆ డేటాను డిజిటలైజేషన్‌తో పాటు చెరువుల వాస్తవ విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి పూర్తి వివరాలతో నివేదికను సిద్ధంగా చేయనున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించి తదుపరి చర్యలను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. ప్రాధాన్యాత క్రమంలో చెరువులను ఒకదాని తర్వాత ఒకటిగా పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ - సిద్ధం చేస్తున్న హైడ్రా