SC Objects on CM Revanth Comments : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజకీయ వైరుధ్యంలోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా? అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చిచెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఓటుకు నోటు కేసు పిటిషన్ కొట్టివేత : మరోవైపు ఓటుకు నోటు కేసు ట్రయల్‌ను తెలంగాణ నుంచి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై ఇవాళ జరిగిన విచారణలో కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన వద్దే ఉందని జగదీశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. అందుకే కేసు ట్రయల్‌పై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని వివరించారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న కోర్టు, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోతుందని వ్యాఖ్యానించింది. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో వైఖరి మారిందని జగదీశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం, స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్న ధర్మాసనం, జగదీశ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసింది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు భారీ ఊరట - SC ON VOTE FOR NOTE CASE