Supreme Court : గ్రూప్-1 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాయని పిటిషన్లో అభ్యర్థులు పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఈ క్రమంలో అభ్యర్థులు హైకోర్టును కోరారు. అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అభ్యర్థులు వెళ్లారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం, పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున వాయిదా అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవరసమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కోర్టులు జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన పరీక్షా ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.
గ్రూప్ -1 పరీక్ష నిర్వహణ : తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు అక్టోబరులో మెయిన్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలో వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబుల పత్రాల మూల్యాంకాన్ని మొదలు పెట్టారు. మూల్యాంకనం, మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనను పూర్తి చేయనున్నారు. ఇందుకు మూడు నెలల సమయం పడుతుందని కమిషన్ భావిస్తోంది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు ఎంపిక అయితే ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్ల పరీక్షలు రాయగా, వీరి జవాబుల పత్రాల మూల్యాంకనం నవంబరు రెండో వారంలో మొదలు పెట్టారు. 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ రిలీజ్ కాగా 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబు పత్రం మొదటిసారి మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు రెండోసారి మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్ద తేడా అనేది లేకుంటే కొనసాగిస్తారు. తేడా వస్తే మాత్రం మూడో దశ మూల్యాంకనం చేస్తారు. అప్పుడు మార్కులు ఎన్ని వచ్చాయో తెలుపుతారు. ఆతర్వాత 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు - ఆ జీవో రద్దు కోరుతూ పిటిషన్
గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు