Supreme Court on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్జీని సుప్రీంకోర్టు కోరింది.
కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్‌ను కొనసాగించాలో లేదో చెప్పాలని కూడా కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని అంది. అసలు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను టీటీడీ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనేది టీటీడీ న్యాయస్థానానికి వివరించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సర్వోన్నత న్యాయస్థానం టీటీడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు : లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(బీజేపీ), వైవీ సుబ్బారెడ్డి(వైఎస్సాఆర్సీపీ), రచయిత విక్రమ్ సంపత్, పలువురు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లు వేసిన వారిలో ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు విచారించింది.
ఒకే సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారు: గుజరాత్‌లోని ఎన్డీడీబీ తర్వాత మరేదైనా ల్యాబ్‌తో తనిఖీ చేయించారా అని జస్టిస్ కేవీ విశ్వనాథన్ అడిగారు. ఒకే సంస్థ నివేదికపైనే ఎలా ఆధారపడతారని, ఇంకొన్ని ల్యాబ్‌ల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించిన లూథ్రా, ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. టీటీడీ, ప్రభుత్వ వివరణను నమోదు చేసిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారని, ఇలాంటి కల్తీ నెయ్యిని ఎప్పుడూ ఉపయోగించలేదని టీటీడీ ఈఓ పేర్కొన్నట్లు కొన్ని పత్రికా కథనాలు కూడా చూపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా, ఈ విషయంపై విచారణ అవసరం అని కోర్టు పేర్కొంది. దర్యాప్తు ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ప్రజల మనోభావాల్ని ప్రభావితం చేసేలా రాజ్యాంగపరమైన ఉన్నత స్థాయిలో ఉన్న వారు ప్రకటన చేయడం తగదని తాము ప్రాథమికంగా భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది.
దేవుడినైనా రాజకీయాలకు దూరం ఉంచండి: కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని, కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరం ఉంచుతారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఆ తర్వాత FIR నమోదవడం, సిట్ ఏర్పాటు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేక కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నం మూడున్నరకు వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొంత సంయమనం పాటించేలా మీ క్లయింట్లకు చెప్పాలని టీటీడీతోపాటు ప్రభుత్వం న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.
తిరుమల లడ్డూ వివాదం - యాదాద్రి ప్రసాదంపై అధికారుల కీలక నిర్ణయం - YADADRI LADDU QUALITY TEST IN HYD