Sunnam Cheruvu Victims On HYDRA : మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలపై సియెట్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ మ్యాప్‌లతో తమ నివాసాలను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సియెట్ సొసైటీ సభ్యులు సున్నం చెరువు మ్యాప్‌లను వివరిస్తూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సియెట్ ఇనిస్టిట్యూట్ కోసం 1982లో జస్టిస్ ఆవుల సాంబశివరావు సతీమణి ప్రియంవద, మరో ఇద్దరి పేరుతో 23 ఎకరాలు కొనుగోలు చేశామని, 1992లో లేఔట్ పర్మిషన్ తీసుకొని 233 ప్లాట్లు చేసినట్లు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సదానందం వివరించారు.
ప్రభుత్వం రీసర్వే చేసి ఆదుకోవాలి : తమ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఎఫ్టీఎల్ అనేది తమకు తెలియదని, 2005లో సున్నం చెరువు పూడిక తీసి కట్ట ఏర్పాటు చేశారని, 2009లో ఆ కట్ట ఎఫ్టీఎల్లో ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారన్నారు. అప్పటికే సున్నం చెరువు ఆక్రమణలకు గురైందని సదానందం తెలిపారు. 2013-14లో హెచ్ఎండీఏ సర్వే చేసి డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఫిక్స్ చేస్తూ సియెట్ హౌసింగ్ సొసైటీలోని ఇళ్లని అందులోకి మళ్లించారని ఆరోపించారు. వాస్తవానికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు తమ సొసైటీలోని నివాసాలు చాలా దూరంగా ఉన్నాయని, ప్రభుత్వం రీ సర్వే చేసి తమను ఆదుకోవాలని సియెట్ హౌసింగ్ సొసైటీ డిమాండ్ చేస్తోంది.
"సున్నం చెరువు మా నివాసాలకు చాలా దూరంలో ఉంది. చెరువుకు చాలా ఎత్తులో మా సైట్లు ఉన్నాయి. గత 100 ఏళ్లలో ఎన్నడూ మా ఫ్లాట్ల వద్దకు చెరువు నీళ్లు రాలేదు. ఒక వేళ మా ఫ్లాట్లు ఎఫ్టీఎల్లో ఉంటే ప్రభుత్వం ఏ చర్యతీసుకున్నా మేం సిద్ధం. కానీ అంతకు ముందు రీసర్వే చేసి ఎఫ్టీఎల్ హద్దులు ఫిక్స్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పర్యావరణాన్ని రక్షించాలనే మేము అనుకునేవాళ్లం తప్ప ప్రకృతిని దెబ్బతీసేవారము కాదు. అందువల్ల ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం"- సదానందం, సియెట్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు