Summer Camps for Students in Nalgonda : ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు, వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌ల ద్వారా ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు. నల్గొండకు చెందిన విద్యార్థులు సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొంది ప్రసిద్ధ ఆలయాలు, సాంస్కృతిక కళా వేదికలపై ప్రదర్శనలిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. 40 రోజులుగా కూచిపుడి, భరతనాట్యం, కోలాటంలో తర్ఫీదు పొందారు. వారిలో కొందరు రెండేళ్లుగా నిత్య సాధన చేసేవారున్నారు.
గత 15 ఏళ్ల క్రితం రమేశ్ నృత్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఓ జట్టుగా పలుచోట్ల సాంస్కృతిక కళావేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రేక్షకాదరణతో పాటు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వేసవిసెలవుల్లో భరతనాట్యం శిక్షణ ఎంతో ఉపయోగపడిందని పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమలో ఆత్మస్థైర్యం పెరిగిందని, చాలా ఉత్సాహంగా ఉన్నామని చెబుతున్నారు.
"ఈ క్యాంపు ద్వారా నేను డ్యాన్స్ బాగా నేర్చుకుంటున్నాను. కూటిపూడి నాట్యం నేర్చుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కూచిపూడితోపాటు కోలాటం, భగవద్గీత శ్లోకాలు మొదలగునవి చాలా నేర్పిస్తున్నారు. క్లాసికల్ డ్యాన్స్ వచ్చినప్పటి నుంచి నేను చాలా బాగా చదువుతున్నాను. ఎందుకంటే ఈ నాట్యంతో నేను ఎంతో యాక్టీవ్‌గా ఉన్నాను కూడా." - విద్యార్థులు
Students Utilize Summer Camps in Nalgonda : భరతనాట్యం వంటి సంప్రదాయనృత్యాలపై సమాజంలో సముచిత స్థానం లభిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆచార వ్యవహారాలను చిన్నారులకి తెలియచేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు వారు తెలిపారు.
"మా పిల్లల్లో చాలా మార్పులు గమనించాం. ఈ సమ్మర్ క్యాంప్ పుణ్యమా అని వాళ్లు ఎక్కువగా మొబైల్ చూడటం మానారు. ఇక్కడ నేర్చుకున్న డ్యాన్స్‌ను ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయటం చేస్తున్నారు. అలానే మూడు, నాలుగు దేవాలయాల్లో క్లాసికల్ డ్యాన్స్ కూడా వేశారు. అది మాకెంతో ఆనందాన్నిస్తుంది. ఈ క్యాంపుల్లో కేవలం ఫిజికల్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా మహనీయులు కోసం చెప్పడం లాంటివి చేస్తున్నారు." - విద్యార్థుల తల్లిదండ్రులు
Summer Coaching Camps : భరత నాట్యం వంటి సంప్రదాయ నృత్యాలపై చిన్నారులు, తల్లిదండ్రులు మక్కువచూపడంతో 15 ఏళ్లగా శిక్షణ ఇస్తున్నట్లు నృత్యశిక్షకుడు రమేశ్ చెబుతున్నారు. నాట్యశాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక భావనలు పెంపొందడం సహా పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కూచిపూడి, భరత నాట్యం, కోలాటంలో శిక్షణ ఇస్తున్నట్లు రమేశ్ తెలిపారు. భవిష్యత్‌లో సమ్మర్ క్యాంప్‌లో పాల్గొని, మరిన్ని అంశాల్లో శిక్షణ పొందుతామని విద్యార్థులు చెబుతున్నారు.
"గత పదిహేనేళ్లుగా నేను ఈ శిక్షణను ఇస్తున్నాను. దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే నేను నేర్పించిన విద్యను, ఆ భగవంతునికి సమర్పించడం జరుగుతుంది. ఎన్నోరకాల కార్యక్రమాలు చేయించాను. దేశ ప్రముఖులు రాష్ట్రపతి, గవర్నర్, హైదరాబాద్‌లో ఉన్న బాలభవన్ ఇలా చాలా చోట్ల ఎన్నో ఆద్యాత్మిక ప్రదర్శనులు ఇవ్వటం జరిగింది."-రమేశ్, నృత్య శిక్షకుడు