Basket Ball Players Training in Hyderabad : ఆటలంటే అందరికి ఆసక్తి ఉన్నా, కొందరు మాత్రమే అటువైపుగా అడుగులేస్తారు. అలా వేసిన అడుగులకు మెరుగులు దిద్దుకునే పనిలో పడ్డారీ క్రీడాకారులు. వేసవి సెలవుల్లో ఖాళీగా ఉండకుండా తమకు ఇష్టమైన బాస్కెట్ బాల్ క్రీడలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా క్రీడలోని కిటుకులను వడివడిగా నేర్చుకుంటున్నారు.
ఇప్పుడు గేమ్ ఆడుతున్న వీరంతా హైదరాబాద్‌లోని కేపీహెచ్పీ కాలనీ 7వ ఫేజ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో శిక్షణ పొందుతున్నారు. 2008 నుంచి ఇక్కడ బాస్కెట్ బాల్ శిక్షణ ప్రారంభమైంది. శిక్షణకు అవసరమయ్యే సౌకర్యాలను జీహెచ్ఎంసీ అధికారులు సమకూర్చారు. అప్పటి నుంచి ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతోంది.
క్రీడాకారులు వ్యాయామం చేసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులు జిమ్ ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు గచ్చిబౌలి, మియాపూర్, మూసాపేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు బాస్కెట్ బాల్‌తో పాటు టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు.
చిన్నప్పటి నుంచి బాస్కెట్ బాల్లోనే : చిన్నప్పటి నుంచే ఈ శిక్షణా శిబిరంలో తర్ఫీదు పొందిన క్రీడాకారులు జాతీయస్థాయి టోర్నమెంట్లలో సత్తా చాటారు. సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్శిటీ, అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పతకాలతో పాటు ఉత్తమ క్రీడాకారుడిగా నగదు ప్రోత్సహకాన్ని అందుకున్నారు. ఈ మైదానంలో శిక్షణ తీసుకున్న కొంతమంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను పొందారు.
"బాస్కెట్‌బాల్ నా 7వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాను. మొదటిగా జిల్లాస్థాయి, ఆ తర్వాత యూనివర్శిటీ స్థాయి, దాని తర్వాత రాష్ట్రస్థాయి, నేషనల్, ఖోలో ఇండియాలో పోటీ చేశాను. యూనివర్సిటీ లెవెల్లో తాను గోల్డ్‌మెడల్ సాధించాను. ప్రస్తుతం నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్టుమెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగం కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ కాలనీ గ్రౌండ్స్‌లోనే కోచింగ్ తీసుకున్నాను." - ఆటగాడు
Summer camp Basket Ball : గత 36 ఏళ్లుగా బాస్కెట్ బాల్లో శిక్షణ ఇస్తున్నానని స్థానిక కోచ్ అంజిబాబు అంటున్నారు. యువత శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని జాతీయ స్థాయికి పంపించడమే తన లక్ష్యమని చెప్పారు. సుమారు 50 మంది క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. అందులో చాలా మంది రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో దేశానికి పతకం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తామని శిక్షణ పొందుతున్న క్రీడాకారులు చెబుతున్నారు.
"గత 36 సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ 24 సంవత్సరాలు, 12 ఏళ్లు సనత్‌నగర్ ప్లే గ్రౌండ్లో శిక్షణ ఇచ్చాను. సనత్‌నగర్ ప్లేగ్రౌండ్‌లో చాలా మంది పిల్లలు జాతీయ స్థాయికి వెళ్లారు. అదే విధంగా జీహెచ్ఎంసీ నుంచి కూడా చాలా మంది ప్లేయర్లు ఆడుతున్నారు. ఇక ముందు కూడా జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి చాలా మంది ఆటగాళ్లు వెళతారని ఆశిస్తున్నాను. తెలంగాణకు మంచి పేరును సాధించిపెడతారని అనుకుంటున్నాను. 2008 నుంచి సమ్మర్ క్యాంపు పెట్టి శిక్షణ ఇస్తున్నాను. పిల్లలకు ఆటలో శిక్షణ ఇస్తూ వారిని జాతీయస్థాయి వరకు తీసుకెళ్లాలనేదే నా ధ్యేయం." - అంజిబాబు, బాస్కెట్‌బాల్ కోచ్