Students Fell Ill in Nuziveedu IIIT at Eluru District : రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళనకరంగా మారింది. ఇక్కడే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తుండగా ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా మూడు మెస్‌లలో ఆహారం తిన్న విద్యార్థులు ఎక్కువమంది అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఆదివారం 165 మంది, సోమవారం 229 మంది, మంగళవారం 345 మంది, బుధవారం మొదటి షిఫ్ట్‌లోనే 131 మంది ఆస్పత్రిలో చేరారు. మొత్తంగా సుమారు 770 మంది అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ట్రిపుల్ ఐటీ నిర్లక్ష్యం : కొంతమంది జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మందులు, ఇంజక్షన్ తీసుకొని వసతి గృహాలకు వెళ్లారు. ఎక్కువ నీరసంతో ఉన్న విద్యార్థులను వసతి గృహాల్లో ఉన్న ప్రత్యేక గదుల్లో వైద్యం తీసుకున్నారు. మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిసింది. యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోపోవడంతోనే విద్యార్థులు అనారోగ్యం బారినపడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెస్‌లో అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లేట్లు కడిగే చోటు కూడా దారుణంగా ఉంటుందని తెలిపారు.
అధికారులకు లోకేశ్ అదేశాలు : నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ సూచించారు. క్యాంపస్‌లో పర్యటించి పరిస్థితిపై సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఏలూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి శర్మిష్ఠ ట్రిపుల్ ఐటీ మెస్, ఆస్పత్రిని తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని పరిశీలించారు. ఆహారం పెట్టే ప్లేట్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనారోగ్యానికి గురైన విద్యార్థులు ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. విషయం బయటకు పొక్కడంతో మిగిలిన విద్యార్థులను బయటకు పంపేందుకు యాజమాన్యం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.