Street Dogs Attacks Increases in State : పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి. వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలు, గుడిసెలో నిద్రిస్తున్న 5 నెలల బాలుడిపై వీధి కుక్కల దాడి. చికిత్స పొందుతూ బాలుడు మృతి! ఆరుబయట ఆడుకుంటుండగా కుక్కల దాడిలో పసికందు మృతి. ఇలా ఇవన్నీ కుక్కల దాడులకు సంబంధించి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిత్యం ఎక్కడో ఒక చోట శునకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
చిన్నచిన్న గాయాలతో బయటపడ్డ వాళ్లు కొందరైతే, ముఖంపై, కాళ్లపై, శరీరంపై లోతైనా గాయాలతో నరకయాతన అనుభవిస్తున్న వారు మరికొందరు. కుక్కల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలే వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న 5నెలల చిన్నారిపై శునకం దాడి చేసింది.
కుక్కకాటుతో ఆర్థికంగా కుదేలవుతున్న బాధితులకు దిక్కెవరు? - రేబిస్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం ఎటుపోతోంది?
పసికందు తల్లిదండ్రుల ఇంటి యజమాని పెంపుడు శునకమే ఈ దాడి చేయడం విషాదం. ఈ దాడిలో పసికందు తీవ్రంగా గాయపడి పసికందు మృతి చెందాడు. అటు బహిర్భూమికి వెళ్లిన ఓ వృద్దురాలిపై ఐదు వీధికుక్కలు తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది.
Stray Dog Bites in Telangana : రౌడీలు, గుండాల కన్నా, వీధి కుక్కలను చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువ భయపడిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. ఏ వీధిలో చూసినా సుమారు పాతికకు తక్కువ కాకుండా శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అందులో ఏది మంచి కుక్కో, ఏది వ్యాధి సోకిన కుక్కో తెలియని పరిస్థితి. కరిచి , పిక్కలు పీకే దాకా ఊరుకోవడం లేదు. పట్టిన పట్టు విడవకుండా, ఎంత మంది బెదిరించినా బెదరకుండా ఎగబడి మరీ కరుస్తున్నాయి.
కుక్కకాట్లతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశీయంగా 2023లో దాదాపు 27 లక్షల కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే వీధికుక్కల బాధితుల సంఖ్య నిరుడు 26శాతం అధికమైంది. గతేడాది తెలంగాణలో లక్ష, ఆంధ్రప్రదేశ్‌లో 1.89 లక్షల కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడున్నర నెలల్లోనే తొమ్మిది వేల మందికిపైగా శునకాల పంటిగాట్లకు బాధితులయ్యారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు మరో 50 వేల మంది ఉంటారని అంచనా.
దేశంలో గణనీయంగా పెరుగుతున్న కుక్కల సంఖ్య : దేశీయంగా దాదాపు 2 కోట్ల శునకాలు వీధుల్లో తిరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, దిల్లీ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనంలో తేలింది. లోకల్ సర్కిల్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 79% ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధికుక్కల బెడదపై ఆందోళన వెలిబుచ్చారు. వాస్తవంగా సందు గొందుల్లో సంచరించే కుక్కల సంఖ్య అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇతర పరిశీలనలు చాటుతున్నాయి.
సుప్రీం మార్గదర్శకాల ప్రకారం వీధి శునకాలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబిస్ టీకాలు వేయించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. కానీ, అవేవీ అమలుకు నోచుకోవడం లేదనేది బహిరంగ రహస్యమే. ఈ నిర్లక్ష్యపు వైఖరే అభ్యాగులు పాలిట శాపంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 4 లక్షల శునకాల్లో దాదాపు మూడోవంతు వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు జరగనేలేదని తెలుస్తుంది.
ఒంటరిగా కనిపిస్తే బలి - పెరిగిపోతున్న వీధికుక్కల కాట్లు
కుక్కల బెడద తగ్గించడానికి అవసరమైన నిధులు కేటాయింపులు జరగడం లేదనేది మరో వాదన. వాస్తవానికి పురపాలికల్లో కుక్కల్ని పట్టేందుకు ప్రత్యేకంగా వ్యాన్‌ల ఏర్పాటుతో పాటు బృందాలను నియమించాలి. శునకాల్ని బంధించి, ఏనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలకు తరలించి, శస్త్రచికిత్సలు చేసి వదిలేయాలి. అనారోగ్యంతో ఉన్న, రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి చికిత్స అందించాలి. కానీ, నిధుల కొరత సమస్యగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్నది కేంద్రం లక్ష్యం : కుక్కకాటు వల్ల సంక్రమించే రేబిస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో భారతీయులే 36% వరకు ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే, ప్రతి సంవత్సరం సగటున 20 వేలకు పైగా ప్రాణదీపాలు ఇక్కడ కొడిగట్టిపోతున్నాయి. గ్రామీణ దవాఖానాల్లో యాంటీ రేబిస్ టీకాల లేమితో చాలామంది నాటువైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
దేశీయంగా 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్నది కేంద్రం లక్ష్యం. కానీ ఆ విధంగా లక్ష్యం నెరవేరడం లేదనేది నిధుల కేటాయింపులను బట్టి తెలుస్తుంది. లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి, శునకాల సంతాన నియంత్రణ చికిత్సలను చురుకెత్తించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచడం అత్యంత కీలకం.
Dog Attack Protect Ways : కుక్కకాట్లు ఎంతటి ముప్పును తెచ్చిపెడతున్నాయో గ్రహించిన గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందడుగేస్తోంది. గత మూడేళ్లలో కుక్కకాటు మరణం నమోదు కాకపోవడం అక్కడి పని తీరుకు అద్దం పడుతుంది. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు, శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను పాఠశాల విద్యార్థులకు మహిళలకు తెలియజెప్పడం, గోవాలో సత్ఫలితాలు అందిస్తున్నాయి.
బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. కాగా ఆ చర్యలనైనా, లేదా మరో సరికొత్త నిర్ణయాలైనా దేశంలోని రాష్ట్రాలన్నీ అమలు పరిచి కుక్కలబెడద నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వంపై ఉంది. ముఖ్యంగా కుక్కలు యథేచ్చగా తిరిగే హోటళ్లు, మాంసం దుకాణాల యజమానులు ఆహార వ్యర్థాలను ఇష్టారీతిగా వీధుల్లో పారేయకుండా కట్టడిచేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సమ్మర్ ఎఫెక్ట్- కుక్కలకు షూ, కూలర్లు ఏర్పాటు- ఎక్కడో తెలుసా? - Police Dogs Wear Shoes In Karnataka
నిరూపయోగమైన ప్లాస్టిక్‌తో మూగజీవాలకు ఆహారం - Nihit Machine in Hyderabad