Street Dog Bite Cases in Hyderabad : గుడిసెలో నిద్రిస్తున్న 5 నెలల బాలుడిపై వీధి కుక్కల దాడి చికిత్స పొందుతూ బాలుడు మృతి.! ఆరు బయట ఆడుకుంటున్న పసివాడిపై రెచ్చిపోయిన శునకాలు- కుక్కల దాడిలో కన్నుమూసిన చిన్నారి.! నాన్నతో కలిసి పని ప్రదేశానికి వెళ్లి వీధి కుక్కకాటుతో ప్రాణాలు కోల్పోయిన బాలుడు..! పాల పాకెట్ కోసం వెళ్లిన వృద్ధుడిపై శునకాల స్వైరవిహారం- రక్తం కారేలా గాయపరిచిన కుక్కలు.!
ఇలా ఒక్కటా, రెండా ఎన్నో కుక్కకాట్ల వార్తలు నిత్యం ఎక్కడొచోట వింటూనే ఉన్నాం. ఇందులో అధికంగా పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారే ఉంటారు. ఉపాధి దొరుకుతుందని సొంత ఊరిని వదిలి హైదరాబాద్‌కు వస్తే ఇక్కడ మాత్రం వీధి కుక్కల(Street Dog) దాడులతో కన్నవారిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే కుక్కకాట్లు తట్టుకోలేక నగరాన్నీ వదిలి తిరిగి సొంతూళ్లకే వెళ్తున్న వారు ఉన్నారు. ఇలా ఏడాది తిరిగే సరికి వేలల్లో కుక్కకాటు కేసులు(Street Dogs Cases) నమోదవుతున్నాయి.
కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!
Street Dogs Attack on People : రాష్ట్రంలో రోజు రోజుకు కుక్కకాటు బాధితులు ఎక్కువ అవుతున్నారు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ వాళ్లు కొందరైతే ముఖంపై, కాళ్లపై, శరీరంపై లోతైనా గాయాలతో నరకయాతన అనుభవిస్తున్న వారు మరికొందరు. తీవ్ర గాయాలైన పసిపిల్లలకు చికిత్స చేయించేందుకు బాధిత కుటుంబాలు పడే వేదన మాటల్లో చెప్పలేం. ఆస్పత్రుల్లో వేలు, లక్షలు ఖర్చు చేసి తమ పిల్లలను బతికించుకుంటున్నారు. కోటిన్నరకుపైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో వీధి శునకాల రచ్చ నరకాన్ని(Street Dogs Attack) తలపిస్తోంది.
Street Dog Issue in Telangana : రౌడీలు, గుండాల కన్నా వీధి కుక్కలను చూస్తేనే జనం భయపడిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. ఏ వీధిలో చూసినా సుమారు పాతికకు తక్కువ కాకుండా శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అందులో ఏది మంచి కుక్కో, ఏది వ్యాధి సోకిన కుక్కో తెలియని పరిస్థితి. అయ్యో పాపమని కనికరిస్తే పిక్కలు పీకే దాకా ఊరుకోవడం లేదు. పట్టిన పట్టు విడవకుండా ఎంత మంది బెదిరించినా బెదరకుండా ఎగబడి మరీ కరుస్తున్నాయి.
హైదరాబాద్‌లో విషాదం - కుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి
"పాలప్యాకెట్ కోసం బయటకు వస్తే కుక్క వెంట పడింది. ఒక్కసారిగా మీద పడి కరిచి పారిపోయింది. ఇప్పటివరకు ఇక్కడ 10 మందిని ఆ కుక్క కరిచింది. కర్ర పట్టుకుని నడాల్సిన పరిస్థితికి వచ్చేశాం. అధికారులు ఎలాగైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కుక్కలను పట్టుకోవడమా లేదా చంపడమా ఏదోకటి చేయాలని విజ్ఞాప్తి చేస్తున్నాను." - కుక్కకాటు బాధితుడు
Experts Suggestions on Street Dogs Bite : పగలు రాత్రి అని తేడా లేకుండా అన్ని వేళల కుక్కలు విజృంభిస్తున్నాయి. ఒకవేళ వాటి కంట పడినా వదిలించుకోవడం కష్టంగా ఉంటుంది. నడచుకుంటూ వెళ్తున్నా, ద్విచక్ర వాహనం వెళ్లినా వెంటాడి మరీ కాటేస్తున్నాయి. గాయాలకు చికిత్స చేయించుకోవాలంటే బాధితులు ఐదారు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కుక్కకాట్లతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వైద్యారోగ్య శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక కుక్కకాటు కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నట్లు తేలింది.
రోజుకు 200 కేసులు : వీధి గతేడాది నగరవ్యాప్తంగా 30 వేల కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధితుల్లో పెంపుడు కుక్కల కారణంగా 29 శాతం గాయపడితే వీధి శునకాల దాడుల్లో 71 శాతం మంది గాయపడుతున్నారని అంచనా. ఇందుకు నిదర్శనమే నారాయణగూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు. ఈ 2 చోట్ల కనిపించే జనంలో చాలా మంది కుక్కకాటు బాధితులే ఉంటారు. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(IPM)కు రోజూ 150 నుంచి 200 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
దిల్సుఖ్నగర్లో ఐదేళ్ల బాలుడిపై కుక్క దాడి - సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు
Street Dog Bites Cases Per Day : కుక్కకాటుకు గురైన వారు యాంటీ రేబిస్ సూది మందు కోసం రోజు 450- 500 మంది ఆసుపత్రులకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో కుక్కకాటులో తీవ్రంగా గాయపడ్డ వారి కేసుల సంఖ్య పెరుగుతోంది. గతేడాది ఫీవర్ ఆస్పత్రిలో 24,219 కేసులు నమోదయ్యాయి. ఈ ఆస్పత్రి పరిధిలో నమోదైన కేసుల్లో 12 మంది రేబిస్‌తో మరణించడం ఆందోళనకరం. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కుక్కకాటు నివారణకు చర్యలు తీసుకోవాలి : సాధారణంగా వేసవిలో ఎక్కువగా కుక్కలు తమ ప్రతాపాన్ని చూపిస్తుంటాయి. కానీ గడిచిన ఏడాదిలో చూస్తే చలికాలంలో కూడా వీధి శునకాలు రెచ్చిపోయాయి. సగటున నగరంలో రోజుకు 50 నుంచి 100 మంది కుక్క కాటుకు గురవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశముంది. రాబోయేది వేసవి కాలం కావడంతో బాధితుల సంఖ్య మరింత రెట్టింపయ్యే అవకాశాలు లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీహెఎంసీ అధికారులు వీధికుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
'కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం'- రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశం