State Waqf Board opposed the Waqf Act Amendment Bill : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని వక్ఫ్ బోర్డు సమావేశం అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ నేతృత్వంలో నేడు బోర్డు సమావేశమైంది. సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. చట్ట సవరణ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ కమిటీని కలిసి బోర్డు అభిప్రాయం తెలపాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్ణయించింది.
అదేవిధంగా బీజేపీయేతర రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల ఛైర్మన్లు, సీఈవోలతో సదస్సు సమావేశం నిర్ణయించినట్లు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన అప్రజాస్వామిక వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తిరస్కరించిన మొదటి బోర్డు తెలంగాణ వక్ఫ్ బోర్డుగా అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తిరస్కరణకు మద్దతు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
Waqf Board lands in khammam: కబ్జా కోరల్లో వక్ఫ్ బోర్డు భూములు.. అందరి దృష్టి వాటిపైనే
ముస్లింల హక్కులను కాలరాసే కుట్ర : వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పేరిట కేంద్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తోందని అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మండిపడ్డారు. ఆస్తుల స్వాధీనం కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. కేంద్రం తెస్తున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఉద్యమిస్తామని తెలిపారు.
'దేవాలయాల్లో హిందూ మతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే ఉండాలి. కాశీ విశ్వనాథ ఆలయానికి సభ్యులు కావాలంటే హిందువులే అర్హులు. మరి వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లింలతో పాటు ఇద్దరు హిందూ అధికారులను నియమించడం అనేది ఎంత వరకు సమంజసం. దేశంలో 32 వక్ఫ్ బోర్డుల్లో ఏ ఒక్క దానికైనా కేంద్రం నయా పైసా నిధులు ఇచ్చిన దాఖలా లేదు. ముస్లింలను ఓట్ల యంత్రంగా ఉపయోగించుకునే పార్టీలు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నాయి' అని అసదుద్దీన్ ప్రశ్నించారు.