Harish Rao Comments on State Education Dept : విద్యాశాఖ సమస్యలపై స్పందించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తాను రాసిన లేఖకు రాష్ట్ర విద్యాశాఖ అసంపూర్ణ వివరణ ఇచ్చిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. విద్యా వ్యవస్థలో అసలు సమస్యలే లేవని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించడం సరికాదన్నారు.
సమస్కలను పరిష్కరించకుండా వాస్తవాలను పక్కనబెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. విద్యాశాఖలో నెలకొన్న సమస్యలను నిర్ధారించేందుకు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నట్లు పలు సమస్యలను అంశాల వారిగా వివరించారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు.
గత కొన్నాళ్లుగా పెండింగ్‌లోనే బిల్లులు : బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు లేవనెత్తిన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ. 3,000 గౌరవవేతనం గతేడాది డిసెంబర్ వరకే వచ్చాయని, 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్లకు సంబంధించిన 5 నెలల వేతనాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని విద్యాశాఖ దృష్టికి తీసుకువచ్చారు.
తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్‌కు సంబంధించిన నాలుగు నెలల బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయిని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జూన్ నెల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
Harish Rao Fires on Congress Party : కోడిగుడ్డు బిల్లులు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్‌కు సంబంధించి నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (IERP)ల వేతనాలు మే 2024 వరకే వచ్చాయని, మిగతా నెలలకు ఇవ్వాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్నారు.
పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామన్న సీఎం హామీ ఏమాయే? : ప్రతి పాఠశాలకు నెలకు రూ.10వేలు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయిందని, ఈ కార్యక్రమాన్ని సహృదయంతో తిరిగి పునఃప్రారంభించాలన్నారు. పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చారని, ఇది కూడా మాటలకే పరిమితమైందన్నారు.
అధికారిక ఉత్తర్వులు లేకపోవడం వల్ల పాఠశాలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నానన్నారు. డీఎస్సీ రిక్రూట్ర్మెంట్ పూర్తి అయ్యేలోగా, పిల్లలకు విద్యాబోధన జరిగేలా విద్యావాలంటీర్లను నియమించాలన్నారు. గతేడాదికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.