SBI Junior associate Notification 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్(క్లర్క్) ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూలేని విధంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 342 , ఏపీలో 50 ఖాళీలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐ నియామక పరీక్షను ఇంగ్లిష్‌తో పాటుగా తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూ భాషలో రాసుకునే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్ వివరాలు ఇవి..
పోస్టుల సంఖ్య : 13,735
విద్యార్హత : 31 డిసెంబర్ 2024 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 20-28 సంవత్సరాలు (1.4.2024 నాటికి) (జనరల్ అభ్యర్థులకు)
దరఖాస్తు ఫీజు : రూ.750 (ఓబీసీ/ జనరల్/ఈడబ్ల్యూఎస్) ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ఎక్స్‌ఎస్/ డీఎక్స్‌ఎస్ వారికి ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ : 7 జనవరి, 2025
ప్రిలిమ్స్ పరీక్ష : ఫిబ్రవరి 2025
మెయిన్ పరీక్ష : మార్చి లేదా ఏప్రిల్ 2025 జరగనుంది.
వెబ్‌సైట్: www.sbi.co.in
ఎంపిక విధానం : రెండు దశల్లో ఆన్‌లైన్ ద్వారా నియామక పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండో దశలోని మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. తుది ఎంపికలో ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన మార్కులను పరిణనలోకి తీసుకోరు. ప్రిలిమ్స్ అర్హత పరీక్ష మాత్రమే.
వారికి బోనస్ మార్కులు : 30.11.2024లోగా ఎస్‌బీఐలో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో 5 మార్కులు అంటే 2.5 శాతం అదనంగా కలుపుతారు.
జీతభత్యాలు ఇలా : ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.26,730 మూల వేతనంతో నెల వేతనం ప్రారంభమవుతుంది. అలవెన్సులతో కలిపి ముంబయి లాంటి ప్రాంతాల్లో అయితే రూ.46 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. అంతేకాకుండా పీఎఫ్, లీవ్-ఫేర్, మెడికల్, పెన్షన్, ఇతర సదుపాయాలు ఉంటాయి.
ప్రిపరేషన్ ఏవిధంగా ?
మొదటిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా ఎగ్జామ్ విధానం ఎలా ఉంటుందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. రెండు దశల్లో ఉన్న సబ్జెక్టులను పరిశీలించాలి. పరీక్షకు సంబంధించిన సబ్జెక్టులు, సిలబస్‌ను నోటిఫికేషన్లో వివరించారు. గతంలో నిర్వహించిన మోడల్ పేపర్లను పరిశీలించి ఏ సబ్జెక్టుల్లో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకోవాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్ విభాగాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను గమనించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడిగానే సన్నద్ధత కావాలి.
టీపీటీ సూత్రం
- ఎగ్జామ్ ప్రిపరేషన్లో టీపీటీ సూత్రం ముఖ్య భూమిక పోషిస్తుంది. టీపీటీ అంటే టాపిక్ లెర్నింగ్, ప్రాక్టీస్ ద క్వశ్చన్స్, టెస్ట్ అని అర్థం. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ఆప్టిట్యూడ్,రీజనింగ్‌కు ఈ ఫార్ములా ఆధారంగానే ప్రిపేర్ కావాలి. ఈ రెండు విభాగాల్లోని బేసిక్ కాన్సెప్టులు, ఈ తరహాగా వచ్చే ప్రశ్నలు సాధించడం బాగా నేర్చుకోవాలి. ప్రశ్నలను వేగంగా చేసేలా బాగా సాధన చేయాలి. ప్రిలిమ్స్ పరీక్షలో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రశ్నలకు సగటున 34.2 సెకన్లు పడుతుంది. అదే మెయిన్స్‌లో 54 సెకన్ల సమయం పడుతుంది.
- ఎంత వేగంగా చేయగలిగితే అన్ని ఎక్కువ జవాబులు గుర్తించవచ్చు. అందుకు కఠిన సాధన అవసరం. ఈ సమయంలో వేగంగా చేయాలంటే షార్ట్‌కట్ పద్ధతుల్లాంటి మెలకువలు కూడా నేర్చుకుని వాటిని ఉపయోగించాలి. ఆయా టాపిక్స్‌పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వేగంగా, ఎంత కచ్చితత్వంతో ప్రశ్నలు సాధించగలుగుతున్నారో టాపిక్ వారీగా సెక్షన్ల వారీగా మాక్ టెస్టులు రాసి తెలుసుకోవాలి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీంతో సుమారు 50 - 60 రోజుల సమయం మాత్రమే ఉంది. టాపిక్స్ వారీగా 30 రోజుల్లో పూర్తి చేసుకోవాలి.
- పరీక్షకు నెల రోజుల ముందు నుంచే వివిధ రకమైన మోడల్ పేపర్లు రాయాలి. ప్రతిరోజూ రాసిన పేపర్‌ను విశ్లేషించుకోవాలి. దాని ఆధారంగా అవసరమైన టాపిక్‌లు ప్రిపేర్ అవుతూ మెరుగుపరుచుకోవాలి. అయితే ఇదే సమయంలో పూర్తిస్థాయి మోడల్ పేపర్ సాధిస్తున్నప్పుడు వెంటనే జవాబులను గుర్తుపట్టే లాంటి మెలకువలను కూడా నేర్చుకుని ఉపయోగించాలి. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా మెయిన్స్‌లోని జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగానికి కూడా ప్రతిరోజూ గంట లేదా రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ ప్రిపేర్ కావాలి.
4-3-2-1 ఫార్ములా
పరీక్షకు సన్నద్ధమవుతున్న సమయంలో ఏయే విభాగానికి ఎంత సమయం కేటాయించాలో ఈ ఫార్ములా తెలియజేస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లోని నాలుగు విభాగాల్లో కాఠిన్యత, ప్రాముఖ్యం ఆధారంగా రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలకు 4:3:2:1 నిష్పత్తిలో సమయాన్ని కేటాయించుకోవాలి. అంటే ఒక రోజులో పది గంటలు ప్రిపేర్ అవుతే ఆప్టిట్యూడ్‌కు 4 గంటలు, రీజనింగ్‌కు 3 గంటలు, ఇంగ్లిష్‌కు 2 గంటలు, జనరల్ అవేర్‌నెస్‌కు ఒక గంట సమయాన్ని కేటాయించాలి.
కెరియర్లో పదోన్నతులు: అభ్యర్థులు నిజాయతీ, కష్టపడి పని చేయడం, బ్యాంకు అంతర్గత పరీక్షల ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. జూనియర్ అసోసియేట్ నుంచి క్రమంగా అసిస్టెంట్ మేనేజర్(స్కేల్-1), మేనేజర్(స్కేల్-2), సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వరకూ చేరుకునే అవకాశం.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - డిగ్రీ అర్హతతో SBIలో 13,735 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!