Stanley Drugs Case Updates : హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.8 కోట్ల విలువ చేసే డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడు సౌరవ్ పట్టుబడ్డాడు. టీఎస్ న్యాబ్ పోలీసులు పుణెలో సౌరవ్‌ను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. పంజాగుట్ట పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు స్టాన్లీని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, కీలక సమాచారాన్ని రాబట్టారు.
వ్యాపార వీసాపై వచ్చిన స్టాన్లీ (Drug Dealer Stanley) గోవాలో బట్టల వ్యాపారం చేస్తున్న సమయంలో కండోలిమ్ ప్రాంతంలో ఉంటున్న డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. ఇందులో భాగంగా ఓక్రా సహా మరో ఇద్దరితో కలిసి నిందితుడు చిన్న చిన్న మొత్తంలో మత్తు పదార్థాలు విక్రయించడం ప్రారంభించాడు. కాగా రెండేళ్ల క్రితం ఓక్రా సహా మరో ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. దీంతో స్టాన్లీకి విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మార్గం మూసుకుపోయింది.
Panjagutta Drugs Stanley Case : అయితే గోవాలోని కోల్వాలే జైలు అధికారుల సాయంతో ఓక్రా సెల్‌ఫోన్ వాడటం ప్రారంభించాడు. స్టాన్లీ నుంచి డ్రగ్స్ ఆర్డర్ రాగానే జైలు నుంచే అతను నెదర్లాండ్‌లో ఉన్న మరో డ్రగ్ సరఫరాదారుడికి సమాచారం ఇస్తాడు. అక్కడి నుంచి వస్త్రాల పెట్టెల మధ్యలో సరకును పెట్టి కార్గో విమానాలు, సముద్ర మార్గం ద్వారా కొరియర్లు పుణేకు చేరుతున్నాయి. అక్కడ నెదర్లాండ్ నుంచి వచ్చిన సరుకును సౌరవ్ స్వాధీనం చేసుకుంటున్నాడు.
మరోవైపు ఈ వ్యవహారంలో సౌరవ్‌తో నేరుగా స్టాన్లీకి సంబంధాలు లేనట్లు పోలీసులు గుర్తించారు. నెదర్లాండ్ నుంచి వచ్చిన డ్రగ్స్‌ను క్యాబ్‌లు బుక్ చేసి కావాల్సిన వారికి అతను పంపుతున్నట్లు తేల్చారు. అతని వద్ద రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించేందుకు సిద్దమయ్యారు. నిందితుడి వద్ద ఒక్క స్టాన్లీనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న డ్రగ్ డీలర్లకు సంబంధాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అదే కోణంలో విచారణ ప్రారంభించారు.
International Drug Peddler Stanley Case Updates : మరోవైపు గోవా కోల్వాలే జైలులో ఉన్న ఓక్రా (Drug Dealer Okra) సహా మరో ఇద్దరిని ఈ కేసులో పీటీ వారెంట్‌పై తీసుకొచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు సిద్దమయ్యారు. వారిని విచారిస్తే నెదర్లాండ్స్‌లో ఉన్న సూత్రధారి సహా, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు విభాగం, యాంటీ నార్కోటెక్ బ్యూరో (TSNAB) నిరంతరాయంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా సిద్ధమైంది. డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలని ప్రజలను కూడా భాగస్వాములను చేశారు. ఎటువంటి సమాచారం ఉన్నా అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో నిందితుడు స్టాన్లీ కస్టడీ విచారణ నేటితో ముగుస్తుండటంతో వైద్య పరీక్షల అనంతరం అతన్ని పంజాగుట్ట పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించనున్నారు.
భాగ్యనగరంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్ మహమ్మారి - యువతను దాటి మైనర్ల వరకు!