Irregularities In Electricity Bill Collection : విద్యుత్ బిల్లుల వసూల్లో సిబ్బంది తమ చేతివాటం చూపిస్తున్నారు. నెలనెలా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న కరెంట్ బిల్లులను అధికారులే పక్కదారి పట్టిస్తున్నారు. వినియోగదారుడి నుంచి తీసుకున్న డబ్బులను నెలల తరబడి సొంతానికి వాడుకుంటున్నారు. తాము బిల్లులు చెల్లించినా, కట్టలేదంటున్నారని వినియోగదారులు ఫిర్యాదు చేస్తే అప్పుడు వారి బాగోతాలు బయటపడ్డాయి.
విద్యుత్ బిల్లుల లెక్కలను నెలనెలా పరిశీలించాల్సిన టీజీఎస్పీడీసీఎల్ అకౌంట్స్ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారుల నుంచి తీసుకున్న డబ్బులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం, నెలాఖరున డబ్బులు కట్టడం పరిపాటిగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తాజాగా వెలుగు చూశాయి.
నాలుగు నెలలైనా ఏం చేశారు?: షాద్‌నగర్ డివిజన్ పరిధిలో రూరల్ సెక్షన్‌కు చెందిన గ్రేడ్-2 ఆర్టిజన్ ఒకరు ఫిబ్రవరి 19 నుంచి జులై 18 వరకు 278 బిల్లులు వసూలు చేశారు. వాటికి సంబంధించి రూ.3.63 లక్షలు వసూలు చేసి డిస్కం ఖజానాలో జమ చేయలేదు. ఓ వినియోగదారుడు బిల్లు చెల్లించినా, ఇంకా బకాయి చూపడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూపీ లాగితే ఆర్టిజన్ నాలుగు నెలలుగా చేస్తున్న బాగోతం బయటపడింది. నాలుగు నెలలుగా పెద్ద మొత్తం సొమ్ము సొంతానికి వాడుకుంటుంటే సంబంధిత ఏఏవో, జేఏవో క్యాష్ ఏ చేస్తున్నారని స్థానికుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వారం రోజుల కిందనే ఈ వ్యవహారం సదరు అధికారుల దృష్టికి వచ్చినా, సొమ్ములు కట్టేదాక ఆగి తర్వాత పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇలా వెలుగులోకి వచ్చింది : కందుకూరులో ఏఏవో వినియోగదారులు చెల్లించే డబ్బులు నెలాఖరు వరకు సొంతానికి వినియోగించుకునేవాడు. వినియోగదారుల నుంచి తీసుకున్న డబ్బులను బయట అధిక వడ్డీలకు అప్పు ఇచ్చేవాడు. నెలాఖరులో డిస్కం ఖాతాలో జమ చేసేవాడు. గత కొంతకాలంగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న ఈ బాగోతం చెక్‌బౌన్స్‌తో బయటపడింది. ఈ వ్యవహారంలో కుమ్మకైన జేఏవో క్యాష్తో పాటుగా, సీనియర్ అసిస్టెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగికి సంవత్సరాల తరబడి డబుల్ పింఛన్ ఇచ్చిన సంఘటన కూడా ఇక్కడే చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోనూ బాధ్యుల్ని అప్పట్లో సస్పెండ్ చేశారు. తాజా వ్యవహారంతో రాజేంద్రనగర్ సర్కిల్‌తో పాటుగా సహా డిస్కంలోని మిగతా సర్కిళ్లలోని అకౌంట్స్ విభాగాలపై టీజీఎస్పీడీసీఎల్ నజర్ పెట్టింది.