Water Lifting From Yellampalli Project : శ్రీపాద ఎల్లంపల్లి హెడ్-రెగ్యులేటరీ ద్వారా నందిమేడారానికి అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌజ్‌లోని మోటార్ల ద్వారా మధ్యమానేరుకు నీటిని తరలిస్తున్నారు. లక్ష్మీపూర్‌లోని 5 బాహుబలి పంపులతో రోజుకు ఒకటిన్నర టీఎమ్సీల చొప్పున సుమారు 16 వేల క్యూసెక్కులు మిడ్‌మానేరులోకి చేరుతున్నాయి. వరద కాల్వలో మోటార్ల ద్వారా రైతులు పొలాలకు నీళ్లు మళ్లించుకుంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో : ఇటీవల వర్షాలతో సాగు ఊపందుకుంది. కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో పైర్లసాగు 19.84 శాతం, పెద్దపల్లిలో 29.27 శాతం, జగిత్యాలలో 20.27 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 28.67 శాతానికి చేరింది. వర్షాలు బాగా కురుస్తాయనే అంచనాలతో సాగు విస్తీర్ణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది. ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీలోకి వరదనీరు వచ్చి చేరుతుండటం అక్కడి నుంచి మధ్యమానేరుకు నీరు తరలిస్తుండంతో రైతులకు ఆశాజనకంగా మారింది.
గణనీయంగా పెరిగిన వరిసాగు : రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్నవడ్ల సాగు గణనీయంగా పెరుగుతోంది. స్వల్పకాలిక రకాలతో వరి నార్లకు ఈనెలాఖరు వరకు సమయం ఉండగా అతిస్వల్పకాలిక రకాలతో ఆగస్టు మొదటివారం వరకు, మొత్తంగా వరినాట్లకు ఆగస్టు చివరి వరకు సమయం ఉంది. వర్షాలు అనుకూలిస్తే వరిసాగు గత ఏడాది మాదిరిగా 9.65 లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
సకాలంలో పథకాలు అందిస్తే : ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది. మిగతా రకాల పంటల సాగుకు మరో పక్షం రోజుల వరకు అవకాశం ఉండటంతో పసుపు పంట 35 వేల ఎకరాలు, మక్క 55 వేలు, కంది 11 వేల ఎకరాల్లో సాగులోకి రానుంది. దాదాపుగా 30 వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో అయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పంటల సాగు క్రమంగా పెరుగుతున్న తరుణంలో రుణమాఫీ, పెట్టుబడి సాయం, రైతుబీమా పథకం కొనసాగింపు వంటివి సకాలంలో అందిస్తే రైతులకు మేలు జరగనుంది. వ్యవసాయ యాంత్రీకరణకు నిధుల విడుదల, రసాయన ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటే వానాకాలం సాగుకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరుకు నీటి తరలింపు షురూ - Yellampalli Water Pumping
మిడ్ మానేరు నిర్వాసితుల్లో చిగురిస్తున్న ఆశలు - కుటీర, ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు