Srikalahasti MLA Bojjala Sudheer Reddy Threatens Journalist : నిజాన్ని నిర్బయంగా చెప్పి, ప్రజల తరుపున పోరాడే మీడియాకు రాష్ట్రంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మీడియా ప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై రాజకీయ నాయకుల అనుచరుల దాడులు నిరసనలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి బెదిరించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలోని వికృతమాల, మునగలపాళెం తదితర ప్రాంతాల్లో కొందరు రాజకీయ నేతలు ట్రాక్టర్ ఇసుకకు రూ. 500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు.
శుక్రవారం వ్యక్తిగత సహాయకులతో ‘న్యూస్‌టుడే’ ప్రతినిధికి ఫోన్ చేయించి ‘నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాటతీస్తా, ఏమనుకుంటున్నావ్, ఇదే నీకు చివరి హెచ్చరిక, వైఎస్సార్సీపీ పాలనలో కనబడలేదా? ఇప్పుడే అన్ని గుర్తుకొచ్చాయా, ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో. ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు. నీ కథ ముగిసినట్లే’ అంటూ దుర్భాషలాడారు. జరిగిన ఉదంతాన్ని చెప్పేందుకు ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి ప్రయత్నించినా వినకుండా ఎమ్మెల్యే బెదిరించడం గమనార్హం.
"పెట్రోల్ పోసి తగులబెడతాం - ఈనాడు నిన్ను కాపాడుతుందా?" వైఎస్సార్సీపీ నేతల దారుణం
గతంలో వైఎస్సార్సీపీ హయాంలో సిద్దం సభ కవరేజీకి హాజరైన మీడియా ప్రతినిధులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక్కసారిగా మీడియా గ్యాలరీలోకి ప్రవేశించారు. మద్యం మత్తులో విలేకరులపై పడి వికృతంగా ప్రవర్తించారు. బయటికి వెళ్లాలని కొందరు చెప్పటంతో ‘మీరెవరు మాకు చెప్పడానికి’ అంటూ దూసుకొచ్చారు. ప్రతిఘటించిన వారిని తోసేయడంతో పలువురు విలేకరులు కింద పడి గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు సైతం అదుపు చేయలేదన్న సంగతి తెలిసిందే.
విలేకరులు, మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వక దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. మీడియా స్వేచ్చను హరించేలా రాజకీయనాయకులు ఈ తరహా చర్యలకు పాల్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Attack on Media Condemned: మీడియా ప్రతినిధులపై అవినాష్‌రెడ్డి అనుచరుల దాడిని ఖండించిన విపక్షనేతలు