Srikakulam Varsha Priya India Book of Record with Pencil Art : శ్రీకాకుళానికి చెందిన 19 ఏళ్ల బోటు వర్ష ప్రియ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం తన అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది. అలా మెల్లగా బొమ్మలు వేయడంపై పట్టుసాధించింది. పెయింటింగ్‌పై తనకున్న ఇష్టంతో డిజైనింగ్ చేద్దాకున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో చదవలేకపోయింది. అయితేనేం తనకున్న ప్రతిభతో ఇంటి వద్దనే అందుబాటులో ఉన్న పరికరాలతో కళాకృతులు చేయడం ప్రారంభించింది. మొదట సుద్ధ ముక్కపై బొమ్మలు, అక్షరాలు చెక్కడం ప్రారంభించి వాటిపై పట్టు సాధించింది. తర్వాత పెన్సిల్ ముల్లుపై అక్షరాలు పేర్లు రాయడం నేర్చుకుంది. తన ప్రతిభను పదిమందికి తెలియజేయడానికి ఇస్టాగ్రామ్ వేదిక అయ్యింది. అంతే కాదు ఇస్టాగ్రామ్‌లో పలు అవార్డులకు సంబంధించిన విషయాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకుంది వర్షప్రియ.
తాజాగా 17.15 నిమిషాల్లో పెన్సిల్ ముల్లుపై ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలను బ్లేడ్ సాయంతో చెక్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అప్పటికే 20.15 నిమిషాలతో ఉన్న మరొకరి రికార్డును అధిగమించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. దీంతో వర్షప్రియకు తల్లిదండ్రుల, బంధువులు, చదువుతున్న కళాశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. చిన్నచిన్న కళాకృతులను తయారు చేయడమే కాకుండా వాటిని ఆన్లైన్ ద్వారా తక్కువ ధరకే విక్రయిస్తూ స్వయం ఉపాధి పొందుతుంది ఈ యువతి. అయితే రికార్డ్ గురించి తెలుసుకోవడానికి వర్షప్రియ ఇస్టాగ్రామ్ నుంచి వారిని సంప్రదించానని తెలిపింది.
'ఇంటిలో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి గృహోపకరణాలను చేస్తే పర్యావరణాన్ని కూడా రక్షించొచ్చు. నేను చేస్తున్న కళాకృతులే మా బంధువుల ఇళ్లల్లో జరుగుతున్న ఫంక్షన్లకు, తదితర కార్యక్రమాలకు వారికి గిఫ్ట్‌గా ఇస్తున్నాను. తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతారు.' -వర్ష ప్రియ
తల్లిదండ్రులే స్ఫూర్తి- కళా రంగాల్లో రాణిస్తున్న యువతి - Meda Sindhu Shri From Vijayawada
'మా కూతురికి ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించడం చాలా ఆనందం ఉంది. వర్షప్రియ పడిన కష్టానికి ఫలితం లభించింది. చిన్నప్పటి నుంచి అన్నిటిలోనూ ముందుండే వర్ష ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. ఒకపక్క కళాకృతులు చేస్తున్నా చదువుని ఎక్కడ విస్మరించడం లేదు. మాపై ఆధారపడకుండా తాను తయారు చేస్తున్న కళాకృతులు ఆన్లైన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే కాలేజీ ఫీజులు కట్టుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. హర్ష ప్రియా కోరుకున్నట్లు భవిష్యత్తులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని కోరుకుంటున్నాం.' -తల్లిదండ్రులు
తన ప్రతిభను పెపొందించుకోవడానికి ఇస్టాగ్రామ్ దోహదపడిందంటున్న వర్షప్రియ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని చాలా విషయాలు తెలుసుకోవచ్చని అంటుంది.