Janmashtami Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కృష్ణ దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పూజరులు కృష్ణుణికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు రాధాకృష్ణ అవతారాలు వేసి ఫొటోలు తీస్తున్నారు. వెన్నతో చేసిన వైవేద్యాలు దేవుడికి పెట్టి కోర్కెలు కోరుకుంటున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం మంగళహారతి కార్యక్రమంతో మొదలైన పూజలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు. ఇస్కాన్ ఆలయానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుంటున్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూలైన్లో ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీకృష్ణ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న శ్రీ కృష్ణుని ఆలయంలో గోవిందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం రాధాకృష్ణ మూలవిరాట్టులకు, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలు, పండ్ల రసాలు, గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ, రజత ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించారు.
వేషాలు ధరించి ఉట్టి కొట్టి : శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని మురళీకృష్ణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ హనుమాన్ ఆలయంలో గీత సత్సంగ్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించిన భక్తులు భజనలతో భక్తి భావాన్ని చాటారు. శ్రీకృష్ణుని వేషధారణలో వచ్చిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు తల్లిదండ్రులు కలిసి మువ్వగోపాలుని పాటలకు నృత్యాలు చేశారు. మురళీ కృష్ణునితో ఉట్టిని పగులగొట్టే వేడుక అందరిని కనువిందు చేసింది.
కృష్ణాష్టమి స్పెషల్- కిట్టయ్య లీలల వెనుక అసలు సంగతేంటో తెలుసా? - Sri Krishna Ashtami 2024