Special Story on Devaruppula Banjara Tanda : ఏ.. మనకు చదువులు ఏం వంటపడతాయ్ కానీ మన తాతలు, నాన్నలు చేస్తున్న వ్యవసాయమో లేక ఏదైనా వృత్తో నేర్చుకుంటే ఉపాధికి ఏం ఢోకా ఉండదు. కుటుంబాన్ని ఈజీగా నెట్టుకురావొచ్చు అనేది ఆ తండా వాసుల ఒకప్పటి మాట. కొన్ని దశబ్దాల క్రితం ఎవరైనా పిల్లలు పక్కూరికి బడికి వెళ్తే వీడు ఎందుకూ పనికిరాడు అని మొహమాటం లేకుండా అనేసేవారు. అలాంటి తండాలో నేడు ఇంజినీర్లు, ఉన్నత ఉద్యోగులు. అసలు బంజారా తండాలో ఇంత మార్పు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి.
వలస వచ్చి గ్రామంగా మార్చి : జనగామ జిల్లా దేవురుప్పుల మండలంలో 55 ఏళ్ల క్రితం బంజర తండా అనే గ్రామం ఏర్పడింది. బానోతు హచ్యనాయక్ సహా మరో ఆరుగురు గిరిజనులు బంజర ఊరి నుంచి వెళ్లి తమ పొలాల దగ్గర నివాసాలు నిర్మించుకుని బంజర తండాగా పేరు పెట్టుకున్నారు. అప్పట్లో చదువుకోవాలంటే వారి గ్రామంలో బడులు లేక, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని దేవరుప్పుల మండలం చిన్నమడూరు వెళ్లాల్సిందే. దీంతో ఆ గ్రామంలో ఒకరిద్దరు మినహా ఎవరూ బడికి వెళ్లేవారు కాదు.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించి : హచ్యా నాయక్ ఆరుగురి సంతానంలో హరిసింగ్ ఒకరు. తండాలో ప్రాథమిక విద్య అనంతరం చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో 1985లో పదో తరగతి చదివారు. తర్వాత ఇంటర్ చదివి వరంగల్ ఆర్‌ఈసీ (ఇప్పటి నిట్)లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఎస్టీలు చదువుకుంటే రిజర్వేషన్‌తో మంచి స్థానానికి వెళ్లొచ్చని ఊరికి వచ్చినప్పుడల్లా తండావాసులకు వివరించేవారు. ఏమైనా సందేహాలుంటే చెప్పేవాడు. పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. అలా అందరితో మాట్లాడి ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించారు. దీంతో క్రమంగా చదువుకునే వారి సంఖ్య పెరిగింది. హరిసింగ్ ప్రస్తుతం ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో హైదరాబాద్‌లో పని చేస్తున్నారు.
చిన్నారులను ప్రొత్సహించి : ఇలా గ్రామంలో పది, ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు టీమ్స్‌గా ఏర్పడి, పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు బహుమతులుగా ఇస్తూ పాఠశాలలకు క్రమం తప్పకుండా వెళ్లాలని ప్రోత్సహించేవారు. ఇంజినీర్లు, డాక్టర్లు కావాలంటే ఏం చదవాలి? ఎలా చదవాలి? పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాలను సోదాహరణగా చెప్పేవారు. చదువుకుని ఉద్యోగం సాధిస్తే జీవితం ఎంతో బాగుంటుందని, తండా నుంచి ఉద్యోగాలు సాధించిన వారు వివరించేవారు. ఇలా చిన్నారుల్లో ఒక లక్ష్యం ఏర్పడేలా చేసి, దాన్ని సాధించేందుకు మార్గనిర్దేశం చేసి ప్రోత్సహించేవారు. ఇలాంటి ప్రోత్సాహక వాతావరణం కారణంగా ఇప్పుడు ఆ తండాలో దాదాపు 100 కుటుంబాలకు గానూ 48 మంది ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఇద్దరు వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్లు అయ్యారు. నలుగురు బ్యాంకు మేనేజర్లయ్యారు. ఈ తండా వాసి అయిన హరిత బాసర ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
2018 తర్వాత తండాలోని పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండటంతో విద్యార్థులు లేక అక్కడి ప్రాథమిక పాఠశాలను మూసివేసే స్థితికి చేరుకుంది. దీంతో ఇక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆనంద్ గ్రామస్థుల్లో నమ్మకం పెంచడానికి తన ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించారు. రోజూ తనతో పాటు బడికి తీసుకువచ్చేవారు. ఇది చూసిన తండావాసులు ఎక్కువ మంది మళ్లీ తమ పిల్లల్ని సర్కార్ పాఠశాలలో చేర్పించారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసి బ్యాంకులో పీవో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటివరకు నాలుగు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యాను. దీపావళి తర్వాత నియామక లెటర్లు వస్తాయని ఆశిస్తున్నా. - ధరావత్ కృష్ణ, బీటెక్
ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్నా. ఇప్పటికి నాలుగు ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. సెయిల్‌లో ఉద్యోగం వచ్చేలా ఉంది. విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలి? ఏ కోర్సులు చదవాలి అనే విషయాలపై సెలవు రోజుల్లో గ్రామాల్లో చర్చలు జరుపుతాం. - వెంకటేశ్
నేను అప్పట్లో బడికి వెళ్తుంటే ఎందుకూ పనికిరావు అనేవారు. ఇప్పుడు నా ఉన్నత స్థితి చూసి మెచ్చుకుంటున్నారు. అప్పుడు ఆర్‌ఈసీ వరంగల్‌కు వెళ్తుంటే తండావాసులు గొప్పగా చూసిన తీరు ఎప్పటికీ మరచిపోలేను. చిన్నమడూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల సలహాలు స్వతహాగా ఎదగడానికి ఉపయోగపడ్డాయి. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌లో చేరాక జీవితం మారిపోయింది. గ్రామంలో పిల్లలందరూ చదువుకోవాలనే ఆకాంక్షతో కృషి చేశా. - హరిసింగ్, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్