Irregularities In AP Endowments Dept : దేవాదాయశాఖకు చెందిన ఓ ఇన్‌ఛార్జి ఈవో స్థాయి అధికారి రూ.కోటికిపైగా దేవుడి డబ్బును క్రికెట్ బెట్టింగ్‌ల్లో పెట్టి ఆడేశారు. మరో ఈఓ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే కొందరిని ఆలయ ఉద్యోగులుగా నియమించి నాలుగైదు నెలలుగా జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలానికి ఆర్జేసీ కేడర్ స్థాయి అధికారి బదులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కింది కేడర్ అధికారికి ఈఓగా బాధ్యతలను అప్పగించారు.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని దేవాదాయశాఖలో కొందరు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దేవుని సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటం వల్ల కొందరు అధికారులు అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు వెనకాడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతా ఆయన ఇష్టప్రకారమే : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలోని తిరుమలగిరి ఆలయ ఈఓ కొన్ని మాసాల కింద పలువురిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వాస్తవానికి ఉన్నతాధికారుల అనుమతితోనే వారిని పొరుగుసేవల కింద గానీ, కాంట్రాక్ట్ పద్ధతిలోగానీ తీసుకోవాలి లేదా నియమించాలి. అవేమి పట్టించుకోకుండా నేరుగా నియమించేసుకొని, తొలుత 2 నెలల జీతాలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
జీతాలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే వాళ్లు ఆలయ ఉద్యోగులవుతారు. ఇది రూల్స్‌కు విరుద్ధమని కమిషనరేట్‌కు ఫిర్యాదులు రావడంతో, సమగ్ర వివరాలివ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈఓ ఇవేమీ పట్టించుకోకుండా తాజాగా మరో 2 నెలల జీతాలను కూడా దర్జాగా చెల్లించారు. ఈ వ్యవహారాన్ని గ్రామస్థులు బయటపెట్టగా ఆలయ ఉద్యోగే దీనికి కారణమంటూ ఆయనను ఈఓ వేధించడం మొదలుపెట్టారు..
అర్హత లేకపోయినప్పటికీ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సహాయ కమిషనర్ (ఏసీ) కేడర్‌లో ఉంటూ కర్నూలు ఉప కమిషనర్ (డీసీ)గా చంద్రశేఖరరెడ్డి హవా నడిపారు. అప్పట్లో ఆయనపై చాలా అవినీతి ఆరోపణలొచ్చాయి. కూటమి సర్కారు వచ్చాక ఆయనను శ్రీశైలం ఆలయానికి ఏఈఓగా బదిలీ చేశారు. గత నెలలో శ్రీశైలం ఈఓ పెద్దిరాజు డిప్యుటేషన్ పూర్తికావడం వల్ల మాతృశాఖ (రెవెన్యూ)కు వెళ్లిపోయారు. ఆ సమయంలో డీసీ కేడర్‌లోని డిప్యూటీ ఈఓకి ఇన్‌ఛార్జ్ ఈఓ బాధ్యతలు అప్పగించాలి. ఎండోమెంట్ అధికారులు మాత్రం కింది స్థాయి కేడర్‌లో ఉండి, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఈఓ చంద్రశేఖరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్త ఈఓ వచ్చేవరకు నాలుగైదు రోజుల సర్దుబాటుకే ఆయన్ను నియమించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెగ్యులర్ ఈఓను నియమించకుండా, ఆయన్నే కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
నిధులు డ్రా చేసి క్రికెట్ బెట్టింగ్ ఆడేసి : గతంలో కర్నూలు జిల్లాలో దేవాదాయ ఉపకమిషనర్‌గా పని చేసిన ఓ అధికారి.. కర్నూలు జిల్లాకు చెందిన దేవాదాయ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డికి నంద్యాల జిల్లాలోని కానాల గ్రూప్ ఆలయాల ఈఓగా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఓ ఇన్‌స్పెక్టర్‌కు ఈఓ బాధ్యతలు ఇవ్వకూడదు. అప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి చేతివాటం ప్రారంభించారు. కానాల గ్రూప్ టెంపుల్స్‌కు చెందిన రూ.20 లక్షలను నంద్యాల యూనియన్ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎప్డీ) చేయాలంటూ అసిస్టెంట్ కమిషనర్ లేఖ రాసి, చెక్ ఇస్తే శ్రీనివాసరెడ్డి దానిని ఫోర్జరీ చేశారు. ఆ చెక్‌ను కర్నూలులోని ఎస్‌బీఐ ట్రెజరీ శాఖలో ఫ్యామిలీ మెంబర్లు, ఫ్రెండ్స్ ఖాతాల్లో జమయ్యేలా ఫోర్జరీ లేఖను సృష్టించారు. ఆ సొమ్ము దారి మళ్లించి, క్రికెట్ బెట్టింగుల కోసం వాడేశారు.
దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కర్నూలు కార్యాలయంలో ఉండే చెక్‌బుక్‌ను కాజేసి అసిస్టెంట్ కమిషనర్ సంతకం పోర్జరీ చేసి మూడు సార్లు మొత్తం రూ.66 లక్షలను పక్కదారి పట్టించారు. ఆ సొమ్మును బెట్టింగ్‌లో పోగొట్టారు. కానాల గ్రూప్ టెంపుల్స్‌కు చెందిన రూ.17 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఇతర ఖాతాల్లోకి మళ్లించి వాడేశారు. ఈ క్రతువులో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందని సమాచారం.