Lack of public toilets in Hyderabad : బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనాగరికం. కాదని ఆ పని చేస్తే జరిమానా విధించబడును. మనం మారుదాం. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. ఇదీ, హైదరాబాద్ మహానగరంలోని గోడలపై కనిపించే నినాదాలు. కానీ ఆచరణలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. కోటిన్నరకుపైగా జనాభా ఉన్న నగరంలో మలమూత్ర విసర్జన తీవ్ర సమస్యగా మారింది.
నగర పౌరులే కాదు, నగరానికి వచ్చే పర్యాటకులు, ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వాసులు కూడా గంటల తరబడి ఉగ్గబట్టుకోవాల్సిందే. అత్యవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్ల ఉచిత సౌకర్యాన్ని కల్పించాల్సిన జీహెచ్ఎంసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం, పుట్‌పాత్‌లపై డబ్బు చెల్లించి వినియోగించుకునే సులభ్ కాంప్లెక్స్‌లే అందుబాటులో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఓడీఎస్ ప్లస్ నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయి గుర్తింపు ప్రశ్నార్థకం : ముఖ్యంగా మహిళలు, మధుమేహంతో బాధపడే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇంత పెద్ద మహానగరంలో మహిళలకు కేవలం 19 మూత్రశాలలు మాత్రమే ఉన్నాయంటే ప్రజల ఆత్మగౌరవాన్ని జీహెచ్ఎంసీ ఎంత వరకు కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా పాలకర్గమంతా మహిళల ఆధిపత్యంలోనే ఉన్నా, సమస్యను అర్థం చేసుకునేవారు కరువయ్యారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 2018లో హైదరాబాద్‌ను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరంగా ప్రకటించారు. 6 నెలలపాటు ఆ హోదాతో ఎంతో హుందాతనంగా కనిపించిన భాగ్యనగర వీధులు, ఇప్పుడు అపరిశుభ్రంగా మారాయి. వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా గుర్తింపు సాధించాలనే లక్ష్యానికి క్రమంగా జీహెచ్‌ఎంసీ అధికారులు నీళ్లొదిలారు. దీంతో ఓడీఎస్ ప్లస్ నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ప్రశ్నార్థకంగా మారింది.
Maintenance of Public Toilets : స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో 9వ స్థానాన్ని దక్కించుకున్న జీహెచ్ఎంసీ, మరుగుదొడ్ల నిర్వహణలో మాత్రం అట్టడుగు స్థానంలోనే ఉంది. సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నగరంలో ప్రతి కిలోమీటరు రహదారికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉండాలి. ఆ నిబంధనతో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ క్రమంగా ఆ ఆనవాళ్లే కనిపించడం లేదు.
ఎటు చూసినా నగదు చెల్లించి వినియోగించేవి మాత్రమే కనిపిస్తుండటంతో ప్రజలు జీహెచ్ఎంసీ తీరుపై విసుక్కుంటూనే అదనపు భారాన్ని భరిస్తున్నారు. మరికొంత మంది బహిరంగ ప్రదేశాలు, ఖాళీ స్థలాలు, పుట్ పాత్‌లు, మెట్రో స్టేషన్ల పక్కనే మూత్రవిసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారు. మరి, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు?
Unusable Public Toilets in Hyderabad : ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు, మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ-టాయిలెట్లను ఈటీవీ క్షేత్ర స్థాయిలో పరిశీలించగా ఏ ఒక్కటి కూడా వినియోగానికి పనికి రాకుండా ఉన్నాయి. వాటివైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి నెలకొంది. ప్రారంభించిన స్వల్పకాలానికే కొన్ని మూలనపడ్డాయి. తలుపులు విరిగి కొన్ని, చెత్తాచెదారం, ప్లాస్టిక్ సీసాలతో నిండిపోయి మరికొన్ని దుర్వాసన వెదజల్లుతున్నాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ-టాయిలెట్లు కూడా పనికి రాకుండా పోయాయి.
వనస్థలిపురం నుంచి కోఠి ఉమెన్స్ కళాశాల వరకు, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్, ఖైరతాబాద్ నుంచి ముషీరాబాద్ వరకు ప్రజా మరుగుదొడ్ల ఆనవాళ్లే కనిపించలేదు. కొన్నిచోట్ల మూత్రశాలలకు తడకలు కట్టి తాళాలు వేశారు. మలక్‌పేట న్యూ మార్కెట్ వద్ద పుట్‌పాత్‌లపై ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకునేవారికి నెలకు 4 వేలు రూపాయలకు అద్దెకిచ్చారు. మరికొన్ని చోట్ల ఉచిత మూత్రశాలల్లోని సామాగ్రిని తొలగించి జ్యూస్ పాయింట్లు పెట్టుకోవడం శోచనీయం.
ఈ- టాయిలెట్లు కూడా అలంకార ప్రాయంగానే : 2016లో స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో 100 కోట్ల రూపాయలు వెచ్చించి 6 జోన్లలో 2,114 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మరుగుదొడ్లు నిర్మించారు. అత్యధికంగా ఎల్బీనగర్ జోన్‌లో 500, చార్మినార్ జోన్‌లో 473 ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడం, నాసిరకం నిర్మాణలు కావడంతో ఏడాది తిరగకుండానే అవన్నీ శిథిలావస్థకు చేరాయి. 2018 నుంచి ఒక్కొక్కటి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వాటిలో ఏ ఒక్కటీ నగరంలో కనిపించడం లేదు. అలాగే లగ్జరీ పేరుతో లూ-కేఫ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏసీ టాయిలెట్లు, నాప్కిన్ వెండింగ్ మెషీన్లు, నాప్కిన్ ఇన్సినరేషన్, కిడ్స్ డైపర్ ఛేంజ్ రూం, కేఫే, వైఫై సౌకర్యం, వాటర్ ఏటీఎం, బ్యాంకు ఏటీఎం తదితర సౌకర్యాలు కల్పించారు.
వీటిని ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. కానీ అవి కూడా అంతంతమాత్రంగానే తయారయ్యాయి. మహిళల కోసం నగరంలో ప్రత్యేకంగా 47 చోట్ల 3.75 కోట్ల రూపాయలతో షీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు తమవంతు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో నిధులు కేటాయించాయి. వాటి సహకారంతో ఏర్పాటు చేసిన షీ, ఈ- టాయిలెట్లు కూడా అలంకార ప్రాయంగానే మారాయి. ఇతరత్రా రూపాల్లో ఏర్పాటు చేసిన చోట కూడా ఇదే దుస్థితి నెలకొంది.
నిధులు పక్కదారి పడుతున్నా జీహెచ్ఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు : ప్రస్తుతం నగరంలో 1,818 పబ్లిక్ టాయిలెట్లకుగాను 1,366 మరుగుదొడ్లు మనుగడలో ఉన్నాయని, షీ- టాయిలెట్లు 39 మంజురు కాగా 19 మనుగడలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. 6 జోన్లలో కలిపి 1300 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ చెబుతుండగా, దాదాపు 150 డివిజన్లకు 20 డివిజన్లలో అసలు ప్రజా మరుగుదొడ్లే లేవు. 10 వేల మందికి ఒక మూత్రశాల కూడా లేకపోవడం దారుణం.
ఉన్నవాటిలో 70 శాతం పనికి రాకుండా పోయాయి. అయినా సరే వాటి నిర్వహణకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లిస్తోంది. కనిపించని పబ్లిక్ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్‌ఎంసీకే చెల్లింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్వహణకు బల్దియా 4 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇలా ఏటా కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నా జీహెచ్ఎంసీ పాలకవర్గం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
Public Toilets in GHMC : మరుగుదొడ్ల లభ్యతలో స్త్రీ-పురుషుల నిష్పత్తి 1:1 ఉండాలి. కానీ మహిళలకు సరిపడా మరుగుదొడ్లు లేవు. దీంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బీవోటీ పద్ధతిలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో ఎక్కువగా అటెండర్లుగా పురుషులే ఉన్నారు. మహిళలు వాటిని ఉపయోగించడం కూడా అసౌకర్యంగా భావిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉండటం, తగినంత నీటి లభ్యత లేకపోవడం, దుర్వాసన వస్తుండటం, కేర్ టేకర్లు పురుషులు కావడంతో మహిళలు బహిరంగ మరుగుదొడ్లను ఉపయోగించుకోలేక గంటల తరబడి ఉగ్గబట్టుకుని అనారోగ్యానికి గురవుతున్నారు.
ముఖ్యంగా ఉద్యోగాల కోసం గంటల తరబడి రాకపోకలు సాగించేవారికి నరకయాతనే కల్గుతోంది. ప్రజా మరుగుదొడ్ల పరిస్థితి ఇలా ఉంటే బీవోటీ పద్దతిలో ఏర్పాటు చేసిన మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఓ సామాజిక వర్గానికి ఆ మరుగుదొడ్లను అప్పగించింది. పాదచారుల బాటలపై వాటిని నిర్మించుకున్న ఆ సామాజిక వర్గం, వాటిపై వచ్చే ఆదాయంతో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది.
Public Toilets in City : సులభ్ కాంప్లెక్స్‌లు, పే అండ్ యూజ్ టాయిలెట్ పేరుతో కనిపించే వీటిలోకి వెళ్లాలంటే కచ్చితంగా జేబులో 10 నుంచి 20 రూపాయలు ఉండాల్సిందే. అయితే వీటిపై వచ్చే ఆదాయం జీహెచ్ఎంసీకి రాకపోవడం గమనార్హం. వాటిని తనిఖీ చేయడం, నిర్వహణ బాధ్యతలను కూడా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. అత్యంత సన్నితమైన మూత్రశాలలు, మరుగుదొడ్ల ఏర్పాటు విషయంపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండటంతో 100 శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యం సాకారం కావడం లేదు.
ప్రస్తుతం నగర జనాభాను పరిగణలోకి తీసుకుంటే 10 వేల ప్రజామరుగుదొడ్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకే దగ్గర కాకుండా వెయ్యి చిన్న చిన్న మొబైల్ టాయిలెట్లను తీర్చిదిద్ది వాటిని బహిరంగ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు సహా ఇతర కేంద్రాల వద్ద తక్షణం ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ దిగజారే పరిస్థితి నెలకొంటుంది.
అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption