Story On Custard Apple : నోట్లో వేయగానే తియ్యగా కరిగిపోయే మధుర సీతాఫలాల రుచి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. కాయలను మాగబెట్టుకుని ఉదయాన్నే లేచి ఆత్రుతగా మగ్గావో లేదే చూసుకోవడం ప్రతీ ఒక్కరి చిన్ననాటి స్మృతి. సీతా ఫలాల్లోని ఔషధ విలువలపై ప్రజలకు అవగాహన పెరగటం వల్ల ఇప్పుడు వీటికి గిరాకీ పెరగింది.
సీతాఫలంలో ఉండే పోషకాలు : సీతాఫలం పళ్లలో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆకులు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం, అధిక బరువు తగ్గించడంతో, పాటు జలుబును కూడా నివారించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. వీటిలో కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ సీ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సీతాఫలం పండు లోపలి గుజ్జు తింటే జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతంగా పనిచేస్తుంది. అందుకే పలు కంపెనీలు కూడా మందుల తయారీకి ఈ పండ్లను వినియోగిస్తూ, దిగుమతి చేసుకుంటున్నారు.
పలు ప్రాంతాల్లో జోరందుకున్న క్రయవిక్రయాలు : తెలంగాణ ఆపిల్‌గా పేరొందిన మధురమైన సీతాఫలాల క్రయవిక్రయాలు జనగామ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయి. రోజుకు రూ.లక్షల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు నిలిచిపోవడం వల్ల పల్లె వాసులు కుటుంబ సభ్యులతో కలిసి అడవిబాట పడుతూ సీతాఫలం కాయలను తెంపి, ప్రధాన రహదారులపై అమ్ముతున్నారు. ధర కాస్త ఎక్కువైనప్పటికీ తగిన పోషకాలు మెండుగా ఉండటంతో స్థానికులు, ప్రయాణికులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ధర కాస్త ఎక్కువైనప్పటికీ : జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట్ట తదితర మండలాల నుంచి జిల్లా కేంద్రంలోని ఏరియాసుపత్రి వద్ద ఉన్న మార్కెట్, వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవేపైన అమ్ముతున్నారు. గంప లెక్కన ఒక్కో దానికి రూ.400 నుంచి రూ.600 వరకు విక్రయిస్తుండగా, జనాలు తగిన బేరంతో తీసుకుంటున్నారు. బచ్చన్నపేట మండలం మన్‌సాన్‌పల్లి అటవీ ప్రాంతం నుంచి రెండు రోజులకోసారి వాహనంలో జిల్లా మార్కెట్‌కు ఈ పళ్లను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, మిర్యాలగూడ, కోదాడ, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు కాయల సైజును బట్టి ఎగుమతి చేస్తున్నారు.