Interior Designs and Tips for for Elders: గృహనిర్మాణ రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అవసరాలకు అనుగుణంగా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా రూమ్‌ల నిర్మాణం, డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. చిన్న పిల్లల కోసం ప్రత్యేక గదులు, గది నిండా చిత్రాలతో తయారు చేస్తున్నారు. అదేవిధంగా బంధువులు, అతిథులను ఆకర్షించేలా హాల్ నిర్మాణం, ప్రశాంతంగా నిద్ర పట్టేలా బెడ్‌రూమ్, గృహిణుల అభిరుచులకు అనుగుణంగా వంటగది, ఇలా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలతో డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు. అంతే కాకుండా ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది.
వృద్ధాప్యంలో ప్రమాదాల నివారణకు: ప్రస్తుతం విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న యువత అక్కడే ఉద్యోగం చేస్తూ వివాహం, ఇల్లు కొనుగోలు చేసి కొన్ని సంవత్సరాలకు అక్కడే పౌరసత్వం తీసుకుంటున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లలేక ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వయోభారం పెరుగుతున్న కొద్దీ వీరిలో శరీరపటుత్వం కోల్పోయి, ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంట్లో అనువైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వృద్ధుల అవసరాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణంలో, ఇంటీరియర్ డిజైన్లలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి.
కూర్చొనే వంట పూర్తి చేయొచ్చు: వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘దృఢమైన రౌండ్ ఎడ్జ్ ఫర్నిచర్’ ప్రమాదాలను నివారిస్తుంది. సోఫాలు, కుర్చీలకు ‘హ్యాండ్ రెస్ట్’లు ఏర్పాటు చేయడంతో వాటిని పట్టుకొని నిలబడేందుకు వృద్ధులకు వీలవుతోంది. కుటుంబ సభ్యుల కోసం వివిధ రకాల వంటలు చేయడానికి వృద్ధులు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం వీరు గంటల తరబడి నిలబడే ఇబ్బంది లేకుండా, ఎత్తులో ఉన్న వస్తువులను పట్టుకునే క్రమంలో జారి పడిపోకుండా మినీ కిచెన్ డిజైన్లు (MINI KITCHEN DESIGNS FOR ELDERLY) ప్రస్తుతం మార్కెల్లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూర్చొనే వంట పూర్తి చేయొచ్చు.
యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్: వృద్ధులు చాలా మంది బాత్‌రూమ్‌లో జారి పడుతుంటారు. ఈ పరిస్థితి లేకుండా యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్‌తో పాటు చేతికి అందేలా క్లోజెట్‌లు, కూర్చొనే స్నానం చేసేలా స్టూల్ లేదా సీటింగ్ డిజైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. హాట్, కోల్డ్‌బర్న్‌లను నివారించేలా ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
మోషన్ సెన్సార్ లైట్లు: వయోభారం కారణంగా వృద్ధుల్లో కంటి చూపు మందగిస్తుంది. చేయి పట్టుకుని నడిపించేవారు దగ్గర లేకపోతే నడవడం కష్టం అవుతుంది. కష్టపడి నడిచినా విద్యుద్దీపాల స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయడానికి వెళ్లే క్రమంలో వస్తువులు తగిలి గాయాలు కావడం, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోషన్ సెన్సార్ లైట్లను వినియోగిస్తున్నారు. మనిషి కదలికలను గుర్తించి, ఇవి ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండదు.
ఫర్నీచర్ కొనాలనుకుంటున్నారా..? ఈ రెండింటిలో ఏది బెటరో తెలుసుకోండి!