Special Drive on Dharani Pending Applications : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే ధరణి పోర్టల్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై కమిటీని నియమించి నివేదికలు తెప్పించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ధరణి (Dharani Portal) పెండింగ్ అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ఈరోజుతో ముగియనుంది.
Dharani Portal Problems 2024 : నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ ఈ నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల వరకు కలెక్టర్లకే పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీవోలకు బదలాయించింది. అర్జీల సంఖ్యను బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మండల స్థాయిలో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు.
'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'
ఆ జిల్లాల్లో అధికం : తెలంగాణ వ్యాప్తంగా 2,46,536 అపరిష్కృత దరఖాస్తులు ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 39,000లు, నల్గొండ 23,000లు, సంగారెడ్డి 19,000లు, వికారాబాద్ 14,000లు, నాగర్‌కర్నూల్ 11,000లు, ఖమ్మం 10,000లు ఉన్నాయి. వీటిలో కొన్ని క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయ్యాయి. ఇవి ఆర్డీవోలు, కలెక్టర్లు, సీసీఎల్‌ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వేగంగా పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నాటికి 91,000లకు పైగా అర్జీలను పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. రెండేసి ఖాతాలు ఉండగా వాటిని కలపడం, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యుటేషన్‌లకు సంబంధించినవి ఎక్కువగా పరిష్కరించారు.
అన్ని అర్జీల డెస్క్‌వర్క్ పూర్తి : ఈరోజు వరకు గడువు విధించినా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. 2.46 లక్షల దరఖాస్తులకూ డెస్క్ వర్క్ (దస్త్రాల స్థాయిలో) పూర్తి చేశారని, విచారణ ప్రక్రియ మాత్రమే పెండింగ్ ఉందని చెబుతున్నాయి. డ్రైవ్ ఆఖరి గడువు తరువాత తదుపరి కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. డ్రైవ్ సందర్భంగా గుర్తించిన సాంకేతిక, క్షేత్రస్థాయి సమస్యలపైనా రెవెన్యూ శాఖ సమీక్షిస్తే ఇన్నాళ్లూ పెండింగ్‌కు గల కారణాలు తెలుస్తాయని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు.
ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
మరోవైపు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పని చేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను అధికారులు, సిబ్బంది పరిష్కరించడం పట్ల రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
ధరణి సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ : కోదండ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు