Sons Left Their Mother On Road In Telangana : నవమాసాలు మోసి ముగ్గురు పిల్లల్ని కని పెంచింది. బిడ్డలే సర్వస్వంగా చేతనైనంత కాలం చేసి పెట్టింది. వయోభారంతో పాటు ఆ తల్లిని విధి వెక్కిరించింది. బుక్కెడు బువ్వ పెట్టాల్సిన కొడుకులు ఆస్తి లాక్కుని రోడ్డున పడేయడంతో బిక్కుబిక్కుమంటోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన గాడెపల్లి రామయ్య, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రామయ్య పదేళ్ల కింద చనిపోగా, ముగ్గురు కుమారులు ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. తలా ఓ నెలా తల్లిని చూసుకుంటామంటూ 3ఎకరాల భూమి, బంగారం తీసుకున్నారు. తల్లిని తమ వెంట తీసుకెళ్లకుండా వదిలేయడంతో నర్సమ్మ బతుకు గాలికి తెగిన గాలి పటంలా మారింది.
కుమారులు తిండి పెట్టకపోయినా ఇప్పుడా తల్లికి నిలువ నీడ సైతం లేకుండా పోయింది. ఉన్న పాత ఇళ్లు కూలిపోవడంతో రోడ్ల పక్కన షెటర్ల ముందు తలదాచుకుంటోంది. కుమారులు స్పందించి కాసింత ఆకలి తీరిస్తే చాలని ప్రాధేయపడుతోంది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధ మాతృమూర్తి ప్రాధేయపడుతున్నారు.
వృద్దురాలు ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ - తప్పిన ప్రాణనష్టం
తనకు న్యాయం చేయాలంటూ నర్సమ్మ స్థానికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్సై , తహశీల్దార్లు 3 రు కుమారులను సోమవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్కు రమ్మని పిలిచారు. సోమవారం నాడు ముగ్గురు కుమారులకు కౌన్సిలింగ్ చేసి వృద్ధురాలికి న్యాయం చేస్తామని వారు ఫోన్లో తెలిపారు. ఈ వృద్దురాలికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
'నాకు ముగ్గురు కొడుకులు, అన్నం పెట్టడం లేదు. ముగ్గురు కొడుకులు నన్ను చూసుకుంటారనుకుంటే బువ్వ పెట్టడం లేదు. సంపాధించిన మూడు ఎకరాల భూమిని వారికి రాసి ఇచ్చాను. ఉన్న ఇల్లు సైతం అమ్ముకున్నారు. దీంతో రోడ్డుపై పడ్డాను. ముగ్గురు ఒక్కొనెల చూసుకుంటామన్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నాపై ఉన్న బంగారం తీసుకుపోయారు. నిలువ నీడ లేకపోవడంతో రోడ్డుపై పడుకుంటున్నాను. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను.'- గాడెపల్లి నర్సమ్మ, వృద్ధురాలు