Some Aadhar Cards Deactivate in Telangana : ఇప్పుడు ఏ పథకం కావాలన్న ఆధార్ కార్డు ఉండనిదే పని కావడం లేదు. వయసు ధ్రువీకరణ పత్రం, భూములు రిజిస్ట్రేషన్లు ఇలా చాలా వాటికి ఆధార్‌నే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలోని కొందరు ఆధార్ కార్డులో సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాటిని ఆన్లైన్లో చెక్ చేస్తే డీయాక్టివేట్ అయినట్లు చూపిస్తున్నాయి. దీంతో బాధితులు ఆందోళనకు గురవ్వడమే కాకుండా వాటిని తిరిగి యాక్టివేట్ చేయించుకునే ప్రక్రియలో గందరగోళానికి గురవుతున్నారు.
చదువుకున్న వారు అయితే తెలుసుకొని ఏ విధంగా డీయాక్టివేట్ అయినదాన్ని యాక్టివేట్ ఏ విధంగా చేసుకోవచ్చో చేసుకుంటారు. కానీ చదువులేని వారు యాక్టివేట్ చేయడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఆధార్ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకుంటే డీయాక్టివేట్ అయినట్లు చూపిస్తున్నాయి. అలాగే ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో ఇలాంటి విషయాలు బయటపడుతున్నాయి.
ఆధార్ కార్డు డీయాక్టివేషన్‌కు ప్రధాన కారణాలు :
- ఆధార్ కార్డుల జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో వయసు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
- డీ యాక్టివేట్ అంటే మన దగ్గర ఆధార్ కార్డు ఉన్న అందుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో చూపించవు.
- ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల బీడీ కార్మికుల పీఎఫ్ కోసం వయసు సవరణలకు ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యల కారణంగా కొందరి ఆధార్లు డీయాక్టివేట్ అయ్యాయి.
- ఆధార్ కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలి ముద్రల బదలు వారివి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్‌ను అప్డేట్ చేసుకున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
- కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన సాయిలు తెలియక ఇదే విధంగా చేయగా ఆయనకు మొదటి నుంచి అసలు ఆధార్ కార్డే లేకుండా పోయింది. ఆయన కుమారుడి కార్డు అప్డేట్ చేయబోతే అది డీయాక్టివేట్ అయిపోయింది. దీనికి సంబంధించి ప్రాంతీయ కార్యాలయంలో 40 సార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
ఏళ్ల నుంచి తహసీల్దార్ లాగిన్‌లలో : తహసీల్దార్ లాగిన్‌లలో ఏళ్ల తరబడి : ఆధార్ రీజినల్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాల నిర్ధారణకు అది తహసీల్దార్ లాగిన్‌కు అర్జీలను పంపుతుంది. పని ఒత్తిడి, ఇతర కారణాలతో చాలాచోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్ లాగిన్ తెరిచి వెరిఫికేషన్ చేయటం లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్ లాగిన్‌లలో అవి పెండింగ్‌లో ఉన్నాయి.
సరైన పత్రాలు లేవని వెనక్కి పంపుతున్నారు : హైదరాబాద్‌లోని మైత్రివనంలో ఆధార్‌కార్డుల పునరుద్ధరణ కోసం ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారం రోజుల తర్వాత సరైన పత్రాలు లేవని లేఖ పంపిస్తున్నారు. దాంతో ప్రాంతీయ కార్యాలయంలో వివరణ ఇచ్చేవారే కరవు అయ్యారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన ప్రజావాణిలో అర్జీ చేసుకున్నా ఇంకా తన సమస్య పరిష్కారం కాలేదని ఓ బాధితుడు వాపోయాడు. జిల్లాస్థాయిలో పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.
How to Apply Blue Aadhaar Card : చిన్నపిల్లల కోసం 'బ్లూ ఆధార్' కార్డులు.. ఇలా అప్లై చేసుకోండి.!