Software Employees are Also Labourers in Anantapur District : ఏపీ అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి పంచాయతీకి చెందిన ఒకరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో 050145 జాబ్ కార్డుతో ఉపాధి పనులు హామీ కింద పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి రూ.వేలల్లో డ్రా చేశారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారు. 50193 జాబ్‌కార్డుతో ఉపాధి పనులు చేసినట్లు చూపించి రూ.వేలల్లో సొమ్ము చేసుకున్నారు. మరొకరు బెంగళూరులోనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 050185 జాబ్‌కార్డు మీద గ్రామంలో ఉపాధి పనులకు హాజరైనట్లు చూపించి రూ.వేలల్లో బిల్లులు కాజేశారు. గ్రామంలో లేని వారి పేరుతో మస్టర్లు సృష్టించి సొమ్ము చేసుకున్నారు.
Illegal Looted YSRCP Leaders: ఉపాధి హామీ పథకంపెద్దలకు కాసులు కురిపిస్తోంది. పేదలు రెక్కలుముక్కలు చేసుకుని కూలీ పొందుతున్నారు. కొందరు పెద్దలు మాత్రం ఇళ్లల్లో కూర్చుని అంతకంటే ఎక్కువ కూలీని పొందుతున్నారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి పంచాయతీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పేరుతో మస్టర్లు రూపొందించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.
బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గ్రామంలో ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డులు సృష్టించారు. వారి పేరుతో ఉపాధి పనులు మంజూరు చేశారు. ఒక్కొక్కరి పేరుతో రూ.50 వేల నుంచి లక్ష వరకు బిల్లులు డ్రా చేశారు. చెర్లోపల్లిలో ఐదేళ్లలో ఉపాధి హామీ పథకం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ల కనుసన్నల్లోనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తూతూమంత్రంగా సోషల్ ఆడిట్ : నల్లబోయినపల్లి పంచాయతీకి చెందిన కొందరు వైఎస్సార్సీపీ నేతలు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి అండతో అవినీతికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న వ్యక్తుల పేరుతో ప్రభుత్వ భూములను దోచుకున్నారు. చెర్లోపల్లిలో సుమారు 500 మంది ఉపాధి హామీ పనులకు వెళ్లకపోయినా మస్టర్లు రూపొందించి బిల్లులు చెల్లించారు.
ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్లో నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు జమ చేశారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత అధికారులకు సైతం ముడుపులు అందించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ ఆడిట్ల్లోనూ అక్రమాలు జరగకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.లక్ష చొప్పున లంచం ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ ఆడిట్లు తూతూమంత్రంగా చేపట్టి నివేదికలు అందజేస్తున్నారు.
విచారణ జరిపిస్తాం : నల్లబోయినపల్లిలో అక్రమాలు తమ దృష్టికి రాలేదని డ్వామా పీడీ విజయప్రసాద్ పేర్కొన్నారు. త్వరలోనే ఏపీడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు. అక్రమాలు నిజమైనని తేలితే కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి సొమ్ము రికవరీ చేస్తామని తెలియజేశారు.