Social Media Posts Against Judges Case in AP : సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి, సీఎం జగన్ సిద్ధం సభ(CM Jagan Siddam Sabha)ల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు.
న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ(Criticism of Judges on Social Media), వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకుగాను, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబరులో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి, ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారంట్ సైతం తీసుకుంది.
మణిని అరెస్టు చేసేందుకు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, ఇంటర్‌పోల్ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు? ఎందుకు అరెస్టు చేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోర్టుకు డుమ్మా కొట్టిన వైఎస్సార్సీపీ నేత-అయితేనేం ఆయన స్థానంలో డ్రైవర్ హాజరు పరిచారు!
AP CM Jagan Siddham Sabha : సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టిన మణి అన్నపురెడ్డి సీబీఐ కేసుతో ఆ ఖాతాలన్నింటినీ తొలగించేశారు. ప్రస్తుతం శివ అన్నపురెడ్డి పేరుతో ఫేస్‌బుక్ ఖాతా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రాష్ట్రానికి వచ్చినట్లు అందులో పోస్టు చేశారు. ఈ 6న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పాల్గొన్న మేమంతా సిద్ధం సభకు హాజరైన మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి డయాస్ పాస్ పెట్టుకుని ఏకంగా ర్యాంప్‌పై తిరిగారు. అక్కడ తీసుకున్న ఫొటోలను మేమంతా సిద్ధం అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టారు.
సీఎం జగన్ చేతిలో చెయ్యేసి, నెల్లూరు ఎంపీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఆయన తీసుకున్న ఫొటోనూ అదే రోజు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ యూఎస్ఏ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తన ఫేస్‌బుక్(Face book) బయోలో రాసుకున్నారు. ఫేస్‌బుక్‌లో మణి అన్నపురెడ్డి గతంలో బట్టతల, చిన్న మీసం, ఫ్రెంచ్‌కట్ గడ్డంతో కనిపించేవారు. తాజాగా గుండు, పెద్ద మీసాలతో కనిపిస్తున్నారు. పేరు, రూపం రెండూ మార్చేస్తే ఉనికి చిక్కకుండా ఉంటుందనే ఎత్తుగడతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
కొట్టేది వాళ్లే కేసులు పెట్టేది వాళ్లే - వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై రాళ్ల దాడులు అనేకం
ఆ ఇద్దరు ఒక్కరే : మణి అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫొటోలు, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్ని బెంగళూరు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ నిపుణులకు పంపించి వాటిలో ఉన్నది ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా? అని అభిప్రాయం కోరగా ఒకే వ్యక్తి అని నిర్ధారించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేర్లతో ఉన్న ఫొటోలను పోల్చి చూస్తే ఆ రెండింటిలో ఉన్న వ్యక్తి ముఖకవళికలు ఒకేలా ఉన్నాయి. అయితే ఆ ఫొటోలు వేర్వేరు సంవత్సరాల్లో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఈ ఫొటోలు పంపించగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్లోని వ్యక్తి ఒకరేనని తేల్చి చెప్పారు.
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు