Skill Training For Youth In Medak : మెదక్ జిల్లాలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సత్ఫలితాలనిస్తోంది. వివిధ కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన యువతకు మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలలో శిక్షణ ఇస్తూ ఉపాధి పొందేవిధంగా కృషిచేస్తుంది. ఈ నైపుణ్య శిక్షణ కేంద్రం. రెండేళ్ల కిందట ఏర్పాటైన ఈ కేంద్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 7 బ్యాచ్‌లు పూర్తిచేసుకుని 832 మందికి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి కల్పించారు.
Vocational Training For Youth : డిమాండ్ ఉన్న కోర్సులలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ ముందుకు వచ్చింది. 2022 జూన్ 1న మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ శిక్షణ కేంద్రంలో ఫ్యాషన్ డిజైనింగ్, జరోసి, బ్యూటీషియన్ కోర్సు, కంప్యూటర్, మొబైల్, సర్వీసింగ్, సీసీటీవీ మరమ్మత్తు, హౌస్ వైరింగ్, వంటి కోర్సులు శిక్షణ ఇస్తున్నారు.
ఒక్కో కోర్సులో 30 మందికి : ఈ కోర్సులలో 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ కోర్సుకు ఏడో తరగతి చదివి ఉండాలని మిగిలిన కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణులై లేదా అనుఉత్తీర్ణులై ఉండాలని నిర్వాహకులు తెలిపారు. ఇంటిదగ్గర ఉపాధి లేనివారికి టైలరింగ్, మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి లభిస్తుందని, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రైవేటు సంస్థల్లో ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలంటే వ్యయంతో కూడుకున్న పని. కానీ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నామమాత్ర ఫీజుతో శిక్షణ ఇవ్వడం వల్ల వ్యయం తగ్గి ఉపాధి లభిస్తుంది.
"గ్రామీణ ప్రాంతాల్లో చదువు మధ్యలోనే ఆపేసిన వారికి, పేదవర్గాల వారికి ఈ శిక్షణ ఇప్పించడం జరుగుతోంది. ఫలితంగా శిక్షణ తీసుకున్న యువత సర్వీస్ సెంటర్లలోనూ, పరిశ్రమలలోనూ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. ఈ స్కిల్ ట్రైనింగ్ ధ్రువపత్రంతో ముద్రాలోన్ కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడకి జీరో నాలెడ్జ్‌తో వచ్చిన వారు శిక్షణ పొంది బయటకు వెళ్లేనాటికి 100 శాతం నైపుణ్యాన్ని అందించడం జరుగుతోంది"- రాజేంద్ర ప్రసాద్, శిక్షకుడు
ఉపాధి కోసం నిరుద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతుంటే మరోవైపు మానవ వనరుల కోసం నైపుణ్యం ఉన్న వారి కోసం పరిశ్రమలు ఎదురుచూస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం బాగా పనిచేస్తుందని శిక్షకులు చెబుతున్నారు.