Sitarama Project Works Pending in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో 2017లో సీతారామ ప్రాజెక్టు పనులకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును సత్తుపల్లి ట్రంకు, పాలేరు ట్రంకు, ప్రధాన ట్రంకు అనే మూడు విభాగాలుగా విభజించి పనులు చేపట్టారు. మూడు ట్రంకుల్లో కలిపి కాల్వల పొడవు 79 కిలోమీటర్లు కాగా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రారంభించారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.
Bhatti Vikramarka on Sitarama Project : భద్రాద్రి జిల్లాలో పనులకు కొంతమేర పురోగతి ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం అతీగతీ లేకుండా పోయింది. సత్తుపల్లి ట్రంకులో 9 నుంచి 12 వరకు ప్యాకేజీలుగా పాలేరు ట్రంకులో 13 నుంచి 16 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. 15వ ప్యాకేజీలో భాగంగా ఓ టన్నెల్ నిర్మిస్తున్నారు. అయితే కొన్నిరోజులగా పాలేరు లింకు కెనాల్ పనులు, టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాల్వల్లో యంత్రాలు సైతం కనిపించడం లేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లతోనే గుత్తేదారు పనులను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీతారామ ప్రాజెక్టు అవినీతిమయం అంటూ వ్యాఖ్యానించారు. పనులపై పూర్తి విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాలని సర్కారు ఆదేశించింది.
రూ.100 కోట్లతో సీతారామ ప్రాజెక్ట్ కాలువ అనుసంధానం పనులకు శంకుస్థాపన
పాలేరు లింకు కెనాల్‌పై నివేదిక : ఇప్పటి వరకు పాలేరు లింకు కెనాల్ పనుల కోసం చేసిన ఖర్చుల వివరాలు, అంచనా వ్యయం, ప్యాకేజీల సాగు లక్ష్యంపై పూర్తి నివేదిక సైతం సమర్పించాలని జలవనరుల శాఖ అధికారులకు కోరింది. అంతే కాకుండా ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చేయొద్దని ఆదేశాలిచ్చినట్లు వాదన వినిపిస్తోంది. తాజా పరిణామాల వెనుక ఉన్న అసలు మతలబు ఏంటన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇన్నాళ్లు నత్తనడకన సాగుతూ వచ్చిన పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పంటకు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఏళ్లుగా ఈ ప్రాజెక్టుపైనే ఆశలు పెట్టుకున్నామని అంటున్నారు. జిల్లా మంత్రులు చొరవ తీసుకుని కాల్వల పనులను పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
'మాకు సీతారామ కాలువ వల్ల భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయాయి. త్వరగా దీన్ని పూర్తి చేయాలి. మమ్మల్ని ఆదుకోవాలని మంత్రిని కోరుతున్నాం. కాలువ పూర్తి కాక, నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. దీని వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ఒకవేళ ఈ కాలువ త్వరగా పూర్తయితే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలువపై ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం.' -రైతులు
సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి తుమ్మల