Sitarama Project Inauguration By CM Revanth : ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి, మోటర్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ బహిరంగసభ వేదికపై నుంచే మూడో విడత రైతురుణ మాఫీని రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల : ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి మోటారు స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా పనులు పూర్తి చేయటం చరిత్ర అని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభ సూచికమని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వైరాలో జరగనున్న బహిరంగ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ముజుమిల్ ఖాన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు 30 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు మంత్రులు హాజరవుతున్న దృశ్యా బాంబు స్క్వాడ్, పోలీసు జాగిలాలతో ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
"సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభ సూచికం."-తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్ రన్ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run