SIT Investigation On Violence In AP Elections: ఎన్నికల పోలింగ్ హింసలో ఎవరి పాత్రేంటో తేల్చే పనిలో సిట్ నిమగ్నమైంది. ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలిస్తోంది. అల్లర్లను ఎందుకు నిలువరించలేకపోయారని స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నేడు సిట్ బృందాల విచారణ కొనసాగనుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ బృందాలు శనివారం వేర్వేరుగా దర్యాప్తు చేశాయి.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation
అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిట్ సభ్యులు: ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల సిట్ బృందం నరసరావుపేటలో అల్లర్లు జరిగిన మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్డులోని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద సంఘటన స్థలాలను పరిశీలించింది. అనంతరం పల్నాడు రోడ్డులోని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌లు అధ్యయనం చేసింది. ఈ సంఘటనల్లో ఏయే వర్గాలు పాల్గొన్నాయి? ముందుగా రెచ్చగొట్టింది ఎవరు? తదితర వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీలు పరిశీలించారు.
ఇప్పటివరకూ ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఏయే సెక్షన్లు పెట్టారు? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అరెస్టులున్నాయా? వంటి వివరాలను సీఐ భాస్కర్‌ను అడిగారు. అల్లర్లను ఎందుకు నియంత్రించలేదని సిట్ బృందం పోలీసులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేడూ సిట్ అధికారులు నరసరావుపేటలో విచారణ కొనసాగించనున్నారు.
Reasons Behind Violence In AP Election Polling: ఇక ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని సిట్ బృందం తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి రికార్డులు పరిశీలించింది. పోలింగ్ రోజు రాళ్ల దాడి జరిగిన ఓంశాంతినగర్, 14న ఘర్షణ చోటు చేసుకున్న జూనియర్ కాలేజీ మైదానం, చింతలరాయునిపాలెం తదితర ప్రాంతాల్ని పరిశీలించింది. కొందరు స్థానికులనూ ఘటనలపై ఆరా తీసింది. తాడిపత్రి పాతకోట పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంటు ఖాజా మోహిద్దీన్‌పై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేశారు.
పోలింగ్ మరుసటి రోజు పెద్దారెడ్డి టీడీపీ బీసీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు అనుచరులతో వెళ్లి రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం చెలరేగిన రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. సిట్ బృందం తాడిపత్రి చేరుకునే సమయానికి బాధితులెవరూ స్థానికంగా లేరు. పోలీసులు నిందితులతోపాటు బాధితులపైనా కేసులు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు సమయంలో బాధితులను తాడిపత్రిలో ఉండనీయకుండా బయటకు బలవంతంగా పంపించారనే ఆరోపణలున్నాయి.