Plastic Banned In Amrabad Tiger Reserve : అమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యంలో ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను నిషేధించాలని అటవీ శాఖ నిర్ణయించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కవర్లు, అభయారణ్యంలోకి అనుమతించరు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అమలు చేశాక దశలవారీగా రాష్ట్రంలోని ఇతర అభయారణ్యాల్లో అమలు చేసే అవకాశముందని అటవీ అధికారి ఒకరు తెలిపారు.
ప్లాస్టిక్‌తో వన్యప్రాణులకు తీవ్ర హాని : అమ్రాబాద్ టైగర్ రిజర్వు నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల్లోని 2611.4 చ.కి.మీ.లలో విస్తరించి ఉంది. ఇందులో హైదరాబాద్-శ్రీశైలం మార్గంలోని మన్ననూరు చెక్‌పోస్టు నుంచి దోమలపెంట మధ్య ఉన్న ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటీఆర్) పరిధిలోకి వస్తుంది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులు అధికంగా ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, ఇతర వ్యర్థాలను రోడ్ల మీద పారేస్తున్నారు.
వీటి కారణంగా వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలుగుతోంది. అడవుల్లో మంటల వ్యాప్తికి ఈ వ్యర్థాలు కారణం అవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్‌పై నిషేధం విధించి, ఏటీఆర్‌ను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా తీర్చిదిద్దాలని అటవీశాఖ సంకల్పించింది. ఇందుకు చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించనుంది.
'అమ్రాబాద్ అభయారణ్యంలోకి ప్లాస్టిక్ తేవొద్దు'
ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల బదులు గాజు సీసాలు : శ్రీశైలం మార్గంలో మన్ననూరు, దోమలపెంట, వటవార్లపల్లిలోని దుకాణాల్లో ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌కు బదులుగా గాజు సీసాల్లో నీటిని విక్రయించాలని, కాగితపు, వస్త్ర, జనపనార సంచులు, విస్తరాకుల వంటి పర్యావరణహిత ఉత్పత్తులను విక్రయించేలా చూడాలని అటవీ శాఖ నిర్ణయించింది.
స్టీల్, మల్టీ యూజ్ ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లతో వచ్చేవారిని ఏటీఆర్‌లోకి అనుమతిస్తూ ఇవి లేనివారిని ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచబోతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల సీసాలు తీసుకుని గాజు సీసాల్లో నీళ్లు, ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్, వస్త్ర సంచులు ఇచ్చి లోపలికి పంపిచే ఏర్పాట్లు చేయబోతున్నారు.