Singareni Insurance Scheme Telangana 2024 : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ (Telangana Singareni)పై అదనంగా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఈ పథకం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటివరకు సైనికులకు మాత్రమే ఉన్న బీమా పథకాన్ని సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ సర్కార్‌కే దక్కిందని వెల్లడించారు.
One Crore Insurance To Singareni Employees : కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం (SCCL Insurance Scheme Telangana) గతంలో ఎప్పుడూ లేదని రేవంత్ అన్నారు. 43వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కార్మికుల కుటుంబాలను కాపాడుకునేందుకే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి భారీ బీమా పథకం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు.
సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌పై బదిలీ వేటు - ఫైనాన్స్ డైరెక్టర్ బాలరామ్‌కు అదనపు బాధ్యతలు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంస్థల్లో సింగరేణి సంస్థ కూడా ఉంది. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు తమ వంతు పాత్ర పోషించారు. గత పదేళ్లు సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదు. కేంద్రప్రభుత్వం సహజ వనరులను ప్రైవేటుపరం చేస్తోంది. ఎన్నో ప్రభుత్వ సంస్థలతో పాటు బొగ్గు గనులకు కూడా కేంద్రం వేలం వేస్తోంది. గత ప్రభుత్వం పదేళ్లపాటు నిధులను దుర్వినియోగం చేసింది. 2014లో మిగులు బడ్జెట్‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను దివాళా తీయించారు. - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
తెలంగాణను గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇవాళ అప్పులపై వడ్డీలుగా బ్యాంకులకే ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. ఇంత వేగంగా ఒక రాష్ట్రాన్ని దివాళా తీయించిన సీఎం దేశంలో మరెవరూ లేరని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును అక్టోబర్‌లో మొదలు పెట్టి ఏప్రిల్‌లో పూర్తి చేసిందని తెలిపారు.
సింగరేణి ఫలితాల్లో ఐఎన్టీయూసీ హవా - సత్తా చాటిన ఏఐటీయూసీ
వేసవిలో విద్యుత్ డిమాండ్ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి పెంచాలి : సింగరేణి రివ్యూలో భట్టి