Simhachala Giri Pradakshina in visakha : సింహాద్రి అప్పన్న సన్నిధిలో గిరిప్రదక్షిణ మహోత్సవం ముందుగానే ప్రారంభమైంది. అధికారకంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గిరిప్రదక్షిణను ప్రారంభించాల్సి ఉంది. కానీ పెద్ద ఎత్తున భక్తులు తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ మొదలుపెడుతున్నారు. గిరిప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. 32 కిలోమీటర్ల చుట్టూ సాగే గిరిప్రదక్షిణ కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మంచినీరు అల్పాహారం అందజేస్తున్నారు. ప్రతీ 500 మీటర్లకు కౌంటర్, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.
సింహాచలంలో వైభవంగా వరద పాయసం మహోత్సవం - Varada Payasam Mahostavam
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం అయ్యింది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు. సింహాచల అప్పన్నకు నాల్గో విడత చందన సమర్పణ వేళ గిరి ప్రదక్షిణ చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రసాద్ పరిశీలించారు.
సింహాచల గిరి ప్రదక్షిణకు 8 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాదికోసారి ఆషాడ పౌర్ణమి రోజున సింహాచల గిరి ప్రదక్షిణ జరుగుతుంది. తొలి పావంచా నుంచి అడవివరం , హనుమంత వాక , అప్పుఘర్ , ఇసుకతోట, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తొలి మెట్టు వరకు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.