SIB Ex DSP Praneeth Rao Petition in High Court : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వులను గురువారం వెలువరిస్తామన్నారు. పోలీసు కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పోలీసు స్టేషన్‌లో సరైన సదుపాయాలు లేవని, విచారణ పూర్తయిన తరువాత జైలుకు పంపేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు కోరారు.
విరామం లేకుండా విచారణ : దీనికి సంబంధించి ఇదే హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది మోహన్‌రావు అన్నారు. ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేసిన ఏఎస్పీ డి.రమేశ్ దర్యాప్తులో పాల్గొనకుండా చూడాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా దర్యాప్తు కొనసాగుతోందని, కేవలం కార్యాలయాల పని వేళల్లో మాత్రమే విచారించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అంతేగాకుండా 12 గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా విచారణ కొనసాగిస్తున్నారని, దీని వల్ల ప్రణీత్‌రావు ఇబ్బంది పడుతున్నారన్నారు.
Praneeth Rao Petition Case Update : దర్యాప్తులోని అంశాలను మీడియాకు లీకులు ఇస్తున్నారని, ప్రణీత్‌పై బురద చల్లడానికే ఇలా చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మీడియాకు లీకులు లేకుండా చూడాలన్నారు. మీడియాకు లీకులు ఇవ్వలేదన్న దర్యాప్తు సంస్థ వాదన వాస్తవం కాదని, ఏ సాఫ్ట్‌వేర్ వాడారు, ఏ వస్తువులు ఎక్కడ కొన్నారన్న వివరాలన్నీ గత కొన్ని రోజులుగా పత్రికల్లో వస్తూనే ఉన్నాయన్నారు. అంతేగాకుండా బంధువులను కలవనివ్వడంలేదన్నారు. రెండు రోజులకోసారి వైద్యపరీక్షలు నిర్వహించేలా ఆదేశించాలని కోరారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీ : పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్(public prosecutor) పి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ నెల 13న పిటిషనర్ అరెస్ట్ సమయంలో డీసీపీ ప్రెస్‌నోట్ విడుదల చేయడం మినహా అప్పటి నుంచి డీసీపీగానీ, దర్యాప్తు అధికారిగానీ మీడియాకు సమాచారం ఇవ్వలేదన్నారు. పోలీసు స్టేషన్‌లో కనీస వసతలున్నాయన్నారు. ఫిర్యాదుదారు అయిన ఏఎస్పీ రమేశ్ వాంగ్మూలం నమోదు సమయంలో తప్ప స్టేషన్‌కు రావడంలేదన్నారు. దర్యాప్తులో అతని పాత్ర ఏమీ లేదన్నారు.
Praneeth Rao Petition Case : ఇద్దరు న్యాయవాదులు వస్తున్నారని, న్యాయవాది ఫోన్ ద్వారా తల్లితండ్రులతో కూడా మాట్లాడుతున్నారన్నారని పీపీ నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఏడు రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని, మిగిలింది మూడు రోజులేనన్నారు. ఉపయోగంలేని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని పోలీసుల తరఫు పీపీ కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.
హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు - కస్టడీ రద్దు చేయాలని లంచ్‌మోషన్ పిటిషన్
ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?