Youth Inspiration Story : ఈ యువతికి చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. పుస్తకాల పురుగులా ఎప్పుడూ చదువుతూనే ఉండేది. ఎప్పటికైనా ఉద్యోగం సాధిస్తావని కుటుంబసభ్యులు, స్నేహితులు సరదాగా అంటుండేవారు. ఆ మాటల్నే నిజం చేసింది ఈ యువతి. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో భౌతికశాస్త్రం విభాగంలో ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఔరా అనిపించింది.
Sharada Got 5 Govt Jobs : ఈ యువతి పేరు దేవిరెడ్డి శారద. నల్గొండ జిల్లా మర్రిగూడెంకు చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఉపాధ్యాయురాలు కావాలని చిన్ననాటి నుంచే కలలు కన్నది శారద. అందుకు అహర్నిశలు శ్రమించింది. ఎమ్మెస్సీ ఫిజిక్స్, బీఈడీ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించింది.
ప్రైవేటు కళాశాలలో పాఠాలు బోధిస్తున్నప్పటికీ శారద దృష్టంతా ప్రభుత్వ ఉద్యోగంపైనే ఉండేది. ప్రభుత్వ కొలువు సాధించేందుకు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలకడమే శరణ్యమని భావించింది. అందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన వెంటనే లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెబుతోంది శారద.
చిన్ననాటి నుంచి చదువుల్లో మేటిగా ఉండే శారద,పెళ్లయ్యాక కూడా పట్టువిడకుండా పోటీ పరీక్షలు సమాయత్తమైంది. గర్భంతో ఉండగానే కోచింగ్‌కు వెళ్లింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమ వుతున్నంత కాలం ఒకే గదిలో ఉండేదానినని శారద అంటోంది. రోజుకు సుమారు 18 గంటల పాటు చదివినట్లు చెబుతోంది. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది శారద. కేజీబీవీ ఫలితాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులతో 2 ఉద్యోగాలు సాధించానని చెబుతోంది. సాధారణంగా భౌతికశాస్త్రంలో విద్యార్థులు వెనకబడి ఉంటారు.
అలాంటి వారికోసం సామాజిక మాధ్యమాల ద్వారా క్లాసులు చెబుతానంటోంది శారద. శారద 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందుకు శారద 4 సంవత్సరాలపాటు శ్రమించిందని వారు అంటున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వాళ్లు నోటిఫికేషన్ కోసం ఎదురుచూడవద్దని శారద సూచిస్తోంది. త్వరితగతిన ప్రిపరేషన్ మొదలు పెడితే విజయం వరిస్తుందని అంటోంది.
కెరీర్ పరంగా విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల ఎంతో అవసరం అంటోంది శారద. ఏదో ఉద్యోగం చేస్తున్నాం కదా... సాగుతోంది కదా అనుకుంటే ఇంతటి విజయం సాధించపోయేదాన్నని... చదవకపోవడానికి కారణాలు వెతకకుండా... మనల్ని ముందుకు నడిపించే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని హార్డ్ వర్క్ చేస్తే విజయం వరిస్తుందని అంటోందీ యువతి.
"ప్రైవేటు కళాశాలలో పాఠాలు బోధిస్తున్నప్పటికీ దృష్టంతా ప్రభుత్వ ఉద్యోగంపైనే ఉండేది. ప్రభుత్వ కొలువు సాధించేందుకు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలకడమే శరణ్యమని భావించాను. పోటీ పరీక్షలకు ఇంట్లోనే సన్నద్దమయ్యాను. 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాను". - దేవిరెడ్డి శారద, 5 ప్రభుత్వ ఉద్యోగాల విజేత
స్విగ్గీ, జొమాటో కుర్రాడు - కొట్టాడు 3 సర్కారీ నౌకరీలు - Delivery Boy Got 3 Govt Jobs