Shamirpet MRO Bribe Case : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్ తోడేటి సత్యనారాయణ అవినీతి శాఖ అధికారులకు చిక్కాడు. గచ్చిబౌలిలో ఉంటున్న రామశేషగిరిరావు చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు(Pass Book) జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ, రామశేషగిరిరావు నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్
శామీర్‌పేట మండలంలోని లాల్‌గాడి మలక్‌పేట గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వాసి మొవ్వ శేషగిరిరావు 2006లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం 10 ఎకరాలు భాగస్వామికి అమ్మగా తనకు 29 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తన భూమిని ధరణిలో(Dharani Portal) అప్‌లోడ్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి రూ.40 లక్షలు తహసీల్దార్ సత్యనారాయణ డిమాండ్ చేసినట్లు బాధితుడు శేషగిరిరావు తెలిపారు.
"నేను శామీర్‌పేట మండలంలోని లాల్‌గాడి మలక్‌పేట గ్రామ పరిధిలో 2006వ సంవత్సరంలో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. నా భాగస్వామికి 10 ఎకరాలు ఇవ్వగా ఇంకా నా దగ్గర 29 ఎకరాలు మిగిలింది. ధరణిలో నమోదు చేయమని ఎమ్మార్వో దగ్గరకు సంవత్సరం క్రితం వచ్చాను. ముందు పది లక్షల రూపాయలు అడిగారు. ఆ మొత్తాన్ని ఇచ్చాను. ఏడాది నుంచి తిప్పుతున్నారు కానీ పని కావటం లేదు. కాగా ఇంకా రూ.30 లక్షలు డిమాండ్ చేశారు."- మొవ్వ శేషగిరిరావు, బాధితుడు
Shamirpet MRO Arrest in Bribing Case : ఈ మేరకు 2009లో రూ.20 లక్షల చెక్‌ను ఓ హోటల్లో ఇచ్చినా సరే ధరణిలో అప్‌లోడ్ చేయకుండా జేబులో పెట్టుకుని, మరో రూ.20 లక్షలు డిమాండ్ చేశారన్నారు. డబ్బులు తీసుకొని కూడా పని చేయకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచనతో బాధితుడు తహశీల్దార్ డ్రైవర్ బద్రీకి లంచం ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతణ్ని విచారించగా, తహశీల్దార్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం మాట్లాడిన ఏసీబీ డీఎస్పీ, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కరీంనగర్, నగరంలోని తహసీల్దార్ అక్రమాస్తులపై(Illegal Assets) కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపారు.
ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ - రూ.250 కోట్ల పైనే ఆస్తులున్నట్లు గుర్తింపు
ACB Traps Sub Registrar : మరోచోట సైతం అవినీతి నిరోధక శాఖ వలలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్టార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి చిక్కుకున్నారు. దూద్‌బౌలి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అమీర్ ఫరాజ్ ప్రస్తుతం ఇన్‌చార్జి సబ్‌రిజిస్టార్‌గా వ్యవహరిస్తున్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.2 లక్షలను అమీర్ డిమాండ్ చేశాడు.
ఆ లంచం సొమ్మును గోపీ సింగ్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB Officials) దాడి చేసి పట్టుకున్నారు. వీరిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ ఏసీబీ ప్రత్యేక కోర్టులో అధికారులు హాజరుపరిచారు. కోర్టు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.