Shadnagar Police Brutality Against Female Accused : రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి షాద్‌నగర్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పేద ఎస్సీ మహిళ అని చూడకుండా దారుణంగా కొట్టారు. గత నెల 24న షాద్‌నగర్‌లోని ఓ కాలనీకి చెందిన దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి దొంగతనం చేశారంటూ వీరిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దంపతులతో పాటు వారి మైనర్ కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసి డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతడి సిబ్బంది బాధితురాలిని ఆమె కుమారుడి ముందే విచక్షణా రహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. స్పృహ కోల్పోవడంతో ఇంటికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
"దొంగతనం పేరుతో తొలుత నా భర్తను కొట్టారు. తర్వాత నన్ను తీసుకొని వెళ్లి, చిన్న దుస్తులు తొడిగించారు. చేతులు వెనక్కి కట్టి, నానా అవస్థలు పెట్టారు. కాళ్లు చాపి ఘోరాతిఘోరంగా కొట్టారు. గొంతు ఎండి, ప్రాణం ఆగమైపోతుందని వేడుకున్నా, మహిళనని కూడా చూడకుండా, చేయని తప్పునకు చిత్రహింసలు పెట్టారు." - బాధితురాలు
విచక్షణా రహితంగా చేసిన దాడిపై చర్యలకు స్థానికుల డిమాండ్ : 24 తులాల బంగారం, రూ.2 లక్షలకుగానూ కేవలం తులం బంగారం, రూ.4,000 నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి, పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించడం వెనక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ, ఒక పేద ఎస్సీ మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.