Sexual Assault On Girl : ఈ మధ్య కాలంలో ఆన్లైన్ పరిచయాలు కొంపముంచుతున్నాయి. ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాన్ని పెంచుకుని మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు కొంతమంది. తాజాగా అలాంటి ఘటనే నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్టాగ్రామ్లో 13 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నారాయణ గూడ పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలిల్లోకి వెళితే నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్లో బాధిత మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. షేక్ ఆర్భాస్ (23) అనే వ్యక్తితో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న స్కూల్కు వచ్చిన బాలికను తనతో పాటు కర్ణాటకలోని గుల్బర్గాకు తీసుకువెళ్లాడు నిందితుడు. ఆపై బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమ కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Accused Arrested By The police : కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే షేక్ ఆర్భాస్ అనే వ్యక్తి బాలికను తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. అతడి తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడంతో రెండు రోజుల తర్వాత బాలికను హైదరాబాద్ పంపించి నిందితుడు పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న నిందితుడు షేక్ ఆర్భాస్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.