Seven Years Old Boy Suspected To Infected With Zika Virus : నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా లక్షణాలు కనిపిస్తూ ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గ్రామంలో మెడికల్ క్యాంప్ : అయితే వ్యాధి లక్షణాలు పూర్తిగా నిర్ధరణ కాకముందే బాలుడికి వైరస్ సోకిందనే వార్త వైరల్ అవ్వడంతో రాష్ట్ర ప్రత్యేక వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటించారు. అనంతరం బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ఇంకా నిర్ధారణ కాలేదని వైద్య బృందం స్పష్టం చేసింది. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇంటింట తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు చేపట్టారు.
భయపడాల్సిన అవసరం లేదు : నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని మంత్రి తెలిపారు. వైరస్ లక్షణాలున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.